Oil Demand: పెట్రోల్, డీజిల్ వినియోగంలో భారత్ రికార్డు.. చైనాను దాటనున్న ఇండియా!

Oil Demand : గత దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా చమురు (క్రూడ్ ఆయిల్) డిమాండ్‌ను చైనా బాగా పెంచింది.

Update: 2025-05-23 10:31 GMT

 Oil Demand : పెట్రోల్, డీజిల్ వినియోగంలో భారత్ రికార్డు.. చైనాను దాటనున్న ఇండియా!

Oil Demand : గత దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా చమురు (క్రూడ్ ఆయిల్) డిమాండ్‌ను చైనా బాగా పెంచింది. కానీ రాబోయే పదేళ్లలో ఈ పాత్రను భారత్ పోషించబోతోందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ నివేదిక చెబుతోంది. చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడం, ఎలక్ట్రిక్ వాహనాల (EV) వాడకం పెరగడం వల్ల చైనాలో చమురు డిమాండ్ చాలా తగ్గిపోయింది.

భారత్‌లో పెరుగుతున్న చమురు డిమాండ్

మూడీస్ నివేదిక ప్రకారం.. చైనాలో రాబోయే 3 నుంచి 5 సంవత్సరాలలో క్రూడ్ ఆయిల్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఆ తర్వాత తగ్గుతుంది. కానీ ఇదే సమయంలో భారతదేశంలో మాత్రం ప్రతి సంవత్సరం 3 నుండి 5 శాతం చొప్పున చమురు డిమాండ్ పెరుగుతుందని అంచనా. ఈ తేడా చమురు వ్యాపారంపై అలాగే రెండు దేశాల ఇంధన భద్రత, ఆర్థిక వ్యూహాలపై నేరుగా ప్రభావం చూపుతుంది.

చైనా, భారత్ మధ్య స్పష్టమైన తేడా

ప్రస్తుతం చైనా, భారత్ ప్రపంచంలో చమురును ఎక్కువగా వినియోగించే రెండో, మూడో అతిపెద్ద దేశాలు. అయితే, ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య స్పష్టమైన తేడా కనిపించబోతోంది. చైనాలో చమురు డిమాండ్ క్రమంగా తగ్గుతుంటే, భారతదేశంలో మాత్రం మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణీకరణ (నగరాలు పెరగడం), ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త పథకాల వల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్ డిమాండ్ పెరుగుతోంది. ఈ విషయంపై మూడీస్ నివేదికలో భారతదేశ చమురు వినియోగం చైనాను అధిగమించడమే కాకుండా దిగుమతులపై దాని ఆధారపడడం కూడా పెరుగుతుందని పేర్కొంది.

రిఫైనింగ్ సామర్థ్యం

భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 90 శాతం ఇప్పటికే దిగుమతుల ద్వారా తీర్చుకుంటోంది. అలాగే, 50 శాతం గ్యాస్ కూడా బయటి నుంచే వస్తోంది. దేశీయ మార్కెట్‌లో ఉత్పత్తి తగ్గితే, ఈ దిగుమతులపై ఆధారపడటం మరింత పెరుగుతుంది. మరోవైపు, చైనా కూడా దిగుమతులపై తన ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తోంది. అది దేశీయ ఉత్పత్తిని పెంచడానికి సముద్రంలో చమురు ప్రాజెక్టులలో భారీగా పెట్టుబడులు పెడుతోంది.

భారతీయ కంపెనీల కృషి

అయితే, భారతీయ కంపెనీలు కూడా ఏమాత్రం వెనుకబడి లేవు. ఐఓసీ (IOC), హెచ్‌పీసీఎల్ (HPCL), బీపీసీఎల్ (BPCL) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి రిఫైనింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అంతేకాదు, 2030 నాటికి భారతదేశ రిఫైనింగ్ సామర్థ్యాన్ని సంవత్సరానికి 309.5 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇది దాదాపు 256.8 మిలియన్ టన్నులు ఉంది. ఈ ప్రయత్నాలతో భారత్ ఇంధన భద్రతను సాధించి, ప్రపంచ ఆర్థిక రంగంలో తన ఆధిపత్యాన్ని చాటుకోనుంది.

Tags:    

Similar News