Rare Earth Magnets : చైనా గుత్తాధిపత్యానికి భారత్ చెక్.. ముందుకు వచ్చిన మహీంద్రా

Rare Earth Magnets : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, మోడ్రన్ టెక్నికల్ డివైస్ కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, ఇప్పుడు దేశం మరో ముఖ్యమైన దిశగా అడుగులు వేస్తోంది.

Update: 2025-07-12 05:30 GMT

Rare Earth Magnets : చైనా గుత్తాధిపత్యానికి భారత్ చెక్.. ముందుకు వచ్చిన మహీంద్రా

Rare Earth Magnets : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, మోడ్రన్ టెక్నికల్ డివైస్ కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, ఇప్పుడు దేశం మరో ముఖ్యమైన దిశగా అడుగులు వేస్తోంది. మహింద్రా అండ్ మహింద్రా, ఆటో విడిభాగాల తయారీ సంస్థ యూనియో మిండాలు భారతదేశంలో రేర్ ఎర్త్ మాగ్నెట్స్‌ ను తయారు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇవి ఎలక్ట్రిక్ మోటార్లు, రక్షణ పరికరాలు, హై-టెక్ పరికరాలలో పెద్ద ఎత్తున ఉపయోగించే ప్రత్యేక రకం అయస్కాంతాలు.

ప్రస్తుతం, ప్రపంచంలోని దాదాపు 90శాతం రేర్ ఎర్త్ మాగ్నెట్స్ చైనాలోనే తయారవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అక్కడి నుంచే సరఫరా అవుతున్నాయి. అయితే, ఏప్రిల్ 2025లో చైనా వీటి ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధించినప్పుడు, అమెరికా, యూరోపియన్ దేశాలతో పాటు భారతదేశానికి కూడా పెద్ద షాక్ తగిలింది. చైనా కొన్ని దేశాలకు ఎగుమతులు మళ్ళీ ప్రారంభించినప్పటికీ, భారతదేశానికి మాత్రం ఇంకా ఆ సడలింపు రాలేదు.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, భారత ప్రభుత్వం ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ మిషన్లో భాగంగా దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి గట్టి చర్యలు తీసుకుంటోంది. రేర్ ఎర్త్ మాగ్నెట్స్ విషయంలో భారతదేశాన్ని స్వావలంబన చేయడమే దీని లక్ష్యం. ప్రభుత్వ వర్గాల ప్రకారం, మహింద్రా ఇటీవల భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖతో జరిగిన సమావేశంలో దేశీయంగా మాగ్నెట్స్ తయారీలో ఆసక్తి చూపింది. కంపెనీ దేశీయ భాగస్వాములతో కలిసి పనిచేయడానికి లేదా దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాలపై దృష్టి పెడుతోంది.

మహింద్రా ఇప్పటికే రెండు కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. యూనియో మిండా కూడా ఈ రంగంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది, తద్వారా దేశంలోని పరిశ్రమలు చైనాపై ఆధారపడకుండా ఉంటాయి. ఈ మాగ్నెట్స్ అనేక అత్యాధునిక పరికరాలకు కీలకమైనవి. ఎలక్ట్రిక్ వాహనాల మోటార్ల నుండి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వైద్య పరికరాలు, రక్షణ రంగంలో మిస్సైల్ గైడెన్స్ సిస్టమ్స్ వరకు వీటిని ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఈవీ రంగంలో ఈ టెక్నాలజీ చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. చైనా నుండి దిగుమతులకు ఆటంకాలు ఏర్పడితే, దేశంలోని ఈవీ పరిశ్రమపై ప్రభావం పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో, దేశీయ ఉత్పత్తి దిశగా అడుగులు వేయడం ఇప్పుడు చాలా అవసరం.

Tags:    

Similar News