Gold vs Silver: 2026లో బంగారం కొనాలా? వెండి కొనాలా? ఏది ఎంత పెరుగుతుందంటే..?
Gold vs Silver: 2026లో బంగారం కొనాలా? వెండి కొనాలా? ఏది ఎంత పెరుగుతుందంటే..?
Gold vs Silver: 2025వ ఏడాది బంగారం, వెండి మార్కెట్లకు మరపురాని అధ్యాయంగా నిలిచింది. ఈ రెండు విలువైన లోహాల ధరలు అంచనాలను మించి భారీగా పెరగడంతో, పెట్టుబడిదారుల దృష్టి ఈక్విటీ మార్కెట్ల నుంచి క్రమంగా కమోడిటీ మార్కెట్ల వైపు మళ్లింది. స్టాక్ మార్కెట్లలో పరిమిత లాభాలు.. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అస్థిరత, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కలిసి బంగారం, వెండిని మరింత భద్రమైన పెట్టుబడి ఎంపికలుగా మార్చాయి. ఇప్పుడు 2026 సమీపిస్తున్న వేళ, పెట్టుబడిదారుల్లో ప్రధానంగా రెండు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ పెరుగుదల ధోరణి కొనసాగుతుందా? బంగారం లేదా వెండి ఏది మెరుగైన రాబడిని ఇవ్వగలదు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
గత ఏడాదిని పరిశీలిస్తే.. 2025లో బంగారం ధరలు అసాధారణ స్థాయిలో ఎగబాకాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు 78 శాతం పెరిగి, రూ.75,000 స్థాయి నుంచి సుమారు రూ.1.33 లక్షల వరకు చేరింది. వెండి మాత్రం ఈ ర్యాలీలో బంగారాన్ని మించి పోయింది. కిలో వెండి ధర రూ.85,000 వద్ద ప్రారంభమై దాదాపు 144 శాతం లాభంతో రూ.2.08 లక్షల స్థాయిని తాకింది.ఇదే సమయంలో భారతీయ ఈక్విటీ మార్కెట్లను సూచించే నిఫ్టీ 50 సూచీ కేవలం 10 శాతం లాభాన్ని మాత్రమే నమోదు చేయగలిగింది. ఈ భారీ వ్యత్యాసం కారణంగా బంగారం, వెండిని లాభదాయకమైనదే కాకుండా భద్రమైన ఆస్తులుగా పెట్టుబడిదారులు భావించడం మొదలుపెట్టారు.
ఈ రికార్డు స్థాయి పెరుగుదల వెనుక గ్లోబల్ కారణాలు కీలకంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను పెంచుకోవడం బంగారం ధరలకు బలమైన మద్దతుగా నిలిచింది. మరోవైపు.. వెండికి పారిశ్రామిక రంగాల నుంచి డిమాండ్ వేగంగా పెరిగింది. అమెరికా విధించిన సుంకాలు, అంతర్జాతీయ వాణిజ్య ఒత్తిడులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న అనిశ్చితులు పెట్టుబడిదారులను సురక్షిత ఆశ్రయాలైన ఈ లోహాల వైపు నడిపించాయి.
2026ను దృష్టిలో పెట్టుకుంటే.. బంగారం, వెండి రెండింటి ప్రాథమిక అంశాలు బలంగానే కొనసాగుతాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే.. 2025లో చూసినంత భారీ లాభాలు మళ్లీ అదే స్థాయిలో రావడం కష్టం అని వారు హెచ్చరిస్తున్నారు. తక్కువ వడ్డీ రేట్ల వాతావరణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనంగా ఉండే అమెరికన్ డాలర్, అలాగే ETFల ద్వారా కొనసాగుతున్న పెట్టుబడుల ప్రవాహం బంగారానికి మద్దతుగా నిలవనున్నాయి. ఈ కారణాలతో బంగారం 2026లో కూడా తక్కువ రిస్క్‌తో స్థిరమైన రాబడిని ఇచ్చే పెట్టుబడిగా కొనసాగుతుందని భావిస్తున్నారు.
వెండిపై నిపుణులు మరింత ఆశావహంగా ఉన్నారు. కారణం వెండికి ఉన్న ద్వంద్వ స్వభావం ఉండటం. ఇది ఒకవైపు విలువైన లోహం కాగా, మరోవైపు కీలక పారిశ్రామిక ముడి పదార్థం. ఎలక్ట్రిక్ వాహనాలు, సౌర విద్యుత్ ప్యానెల్లు, బ్యాటరీలు, ఆధునిక సాంకేతిక రంగాల విస్తరణతో వెండికి డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ అంశాలు 2026లో వెండికి మెరుగైన లాభాలను అందించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే, వెండి ధరల్లో ఊగిసలాట ఎక్కువగా ఉండే అవకాశమూ ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 2026 తొలి అర్ధభాగంలో వెండి, బంగారాన్ని మించిన ప్రదర్శన ఇవ్వవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి.
ధరల అంచనాల విషయానికి వస్తే.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 2026 చివరి నాటికి ఔన్సుకు $4,800 నుంచి $5,500 మధ్యకు చేరే అవకాశం ఉందని కొన్ని అంచనాలు సూచిస్తున్నాయి. దీని ప్రభావంగా భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1.50 లక్షల నుంచి రూ.1.65 లక్షల వరకు చేరవచ్చని భావిస్తున్నారు. వెండి విషయంలో, అంతర్జాతీయంగా ఔన్సుకు $75 నుంచి $85 వరకు ధరలు ఉండవచ్చని అంచనా. కొంతమంది బుల్లిష్ విశ్లేషకులు అయితే వెండి ధరలు $100 స్థాయిని కూడా తాకవచ్చని భావిస్తున్నారు. దేశీయంగా చూస్తే, వెండి ధరలు కిలోగ్రాముకు రూ.2.30 లక్షల నుంచి రూ.2.50 లక్షల మధ్య ట్రేడ్ అయ్యే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
పెట్టుబడి వ్యూహాల పరంగా.. నిపుణులు బంగారాన్ని కోర్ పోర్ట్‌ఫోలియో ఆస్తిగా పరిగణించాలని సూచిస్తున్నారు. ధరల ఊగిసలాటను సమర్థంగా ఎదుర్కోవడానికి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)ల ద్వారా బంగారం సేకరించడం మంచిదని వారు అభిప్రాయపడుతున్నారు. వెండిలో పెట్టుబడులు మాత్రం పరిమితంగా ఉంచాలని, ఎందుకంటే ఇందులో అస్థిరత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మార్కెట్ దిద్దుబాట్ల సమయంలో వ్యూహాత్మకంగా లంప్‌సమ్ పెట్టుబడులు పెట్టవచ్చుగానీ, అందులోని ప్రమాదాలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
2026లో బంగారం పెట్టుబడిదారులకు స్థిరత్వం, భద్రతను అందించే సాధనంగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.. వెండి మాత్రం అధిక రిస్క్‌తో కూడుకున్నప్పటికీ, ఎక్కువ రాబడి సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు.పెట్టుబడిదారులు తమ రిస్క్ సామర్థ్యం, ఆర్థిక లక్ష్యాలు పెట్టుబడి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని బంగారం, వెండి మధ్య సరైన సమతుల్యతను సాధించుకోవడం ఎంతో అవసరమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.