Gold Rate Today: పసిడి ప్రియులకు అలర్ట్.. భారీగా తగ్గి మళ్లీ పెరుగుతున్న బంగారం-వెండి ధరలు..!!

Gold Rate Today: పసిడి ప్రియులకు అలర్ట్.. భారీగా తగ్గి మళ్లీ పెరుగుతున్న బంగారం-వెండి ధరలు..!!

Update: 2026-01-05 00:40 GMT

Gold Rate Today: భారతీయులకు సంప్రదాయంగా అత్యంత ప్రీతిపాత్రమైన పెట్టుబడి సాధనంగా భావించే బంగారం ధరలు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి. గత ఏడాది బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో దూసుకెళ్లాయి. ఏడాది మొత్తంగా చూస్తే గోల్డ్ రేటు 70 శాతానికి పైగా పెరిగి ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై విధించిన భారీ సుంకాలు, డాలర్ బలహీనత, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేయడం వంటి అంశాలు ఈ మెటల్‌కు మరింత మద్దతుగా మారాయి. ఫలితంగా బంగారం సురక్షిత పెట్టుబడి మార్గంగా మరోసారి నిలిచింది.

బంగారంతో పాటు వెండిపైనా పెట్టుబడుల ప్రవాహం భారీగా పెరిగింది. ముఖ్యంగా వెండి ధరలు గత ఏడాది ఏకంగా 180 శాతం వరకు ఎగబాకడం గమనార్హం. అయితే ఏడాది చివర్లో పరిస్థితి ఒక్కసారిగా మారింది. గరిష్ఠ స్థాయిలను తాకిన తర్వాత బంగారం, వెండి ధరలు డిసెంబర్ చివర్లో గణనీయంగా పడిపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తొలుత ఇచ్చిన సంకేతాలు తర్వాత మారడంతో మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఒక్కసారిగా దిగజారాయి.

2026 కొత్త సంవత్సర ఆరంభంలో మాత్రం మళ్లీ పరిస్థితి మారుతోంది. వరుసగా రెండు రోజులుగా బంగారం ధరలు పెరుగుతుండగా, ఒక్కసారిగా వచ్చిన ఈ ఎగబాకుడు మార్కెట్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. గతంలో జరిగిన పతనంతో కనిష్ఠ స్థాయిల వద్ద పెట్టుబడిదారులు మళ్లీ కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

దేశీయంగా హైదరాబాద్ మార్కెట్‌ను పరిశీలిస్తే, 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులో రూ. 1,050 పెరిగి తులానికి రూ. 1,24,850కు చేరింది. అంతకుముందు రోజు కూడా రూ. 150 మేర పెరుగుదల నమోదైంది. డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో వరుసగా రూ. 2,900, రూ. 2,800, రూ. 1,200 చొప్పున మొత్తం రూ. 6,900 మేర పడిపోయిన ధరలు ఇప్పుడు మళ్లీ పైకి రావడం విశేషం. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,140 పెరిగి రూ. 1,36,200 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరల విషయానికి వస్తే, ఒక్కరోజులోనే రూ. 4,000 పెరగడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో ధర రూ. 2.60 లక్షలకు చేరింది. అంతకుముందు రోజుల్లో వరుసగా రూ. 29,000 మేర తగ్గిన వెండి ధరలు ఇప్పుడు మళ్లీ ఊపందుకోవడం గమనార్హం.

అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం స్వల్ప ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 4,332.75 డాలర్ల వద్ద ఉండగా, ఇంట్రాడేలో ఒక దశలో 4,400 డాలర్లను తాకింది. వెండి ధర కూడా 72.86 డాలర్ల వద్ద స్థిరపడింది. ఇక డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 90.19 వద్ద కొనసాగుతోంది.

Tags:    

Similar News