Gold Price: భగ్గుమన్న పసిడి.. రూ. 1.58 లక్షలకు తులం బంగారం.. చరిత్రలో తొలిసారిగా ఆ మైలురాయి దాటిన ధర!
Gold Price: బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం 5,000 డాలర్ల మార్కును దాటడంతో, భారత్‌లో 10 గ్రాముల ధర రూ. 1.58 లక్షలకు చేరింది. దీనికి గల కారణాలు మరియు భవిష్యత్ అంచనాలు ఇక్కడ తెలుసుకోండి.
Gold Price: భగ్గుమన్న పసిడి.. రూ. 1.58 లక్షలకు తులం బంగారం.. చరిత్రలో తొలిసారిగా ఆ మైలురాయి దాటిన ధర!
Gold Price: పసిడి ప్రియులకు షాకిస్తూ అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఔన్సు బంగారం ధర తొలిసారిగా 5,000 డాలర్ల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. దీని ప్రభావంతో భారతీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 1.58 లక్షలకు చేరుకుంది.
రికార్డు స్థాయి ధరలు: ప్రస్తుతం స్పాట్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 5,092.71 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. పసిడి బాటలోనే వెండి కూడా పరుగులు తీస్తూ ఔన్సుకు 105 డాలర్ల వద్ద కొనసాగుతోంది. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే బంగారం ధరలు ఇంతలా పెరగడం ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేస్తోంది.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలివే:
గ్రీన్‌లాండ్ వివాదం: అమెరికా, నాటో దేశాల మధ్య గ్రీన్‌లాండ్ విషయంలో తలెత్తిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి.
డాలర్ బలహీనపడటం: అంతర్జాతీయంగా డాలర్ విలువ పడిపోవడం, రుణ సంక్షోభం తలెత్తుతుందనే భయాలతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.
యుద్ధ వాతావరణం: ఉక్రెయిన్, గాజా యుద్ధాలతో పాటు ఇరాన్, వెనిజులాలో నెలకొన్న అనిశ్చితి ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తున్నాయి.
సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు: ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని నిల్వ చేస్తుండటంతో డిమాండ్ విపరీతంగా పెరిగింది.
ముందుంది ముసళ్ల పండుగ? గోల్డ్‌మన్ శాక్స్ మరియు బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి ప్రముఖ ఆర్థిక సంస్థల అంచనా ప్రకారం.. బంగారం ధరలు ఇక్కడితో ఆగేలా లేవు. 2026 చివరి నాటికి ఔన్సు బంగారం ధర 6,000 డాలర్లకు (భారత్‌లో తులం ధర దాదాపు రూ. 1.80 లక్షల పైమాటే) చేరుకోవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.