Starlink: స్టార్‌లింక్‌కు భారత్‌లో గ్రీన్ సిగ్నల్.. ఇంటర్నెట్ సేవలకు లైసెన్స్ జారీ
Starlink: ప్రముఖ టెక్ దిగ్గజం ఇలాన్ మస్క్ సారథ్యంలోని స్టార్‌లింక్ సంస్థకు భారత్‌లో సాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. కేంద్ర దూరసంచార శాఖ స్టార్‌లింక్‌కు ఈ సేవలు అందించడానికి లైసెన్స్‌ను మంజూరు చేసింది.
Starlink: స్టార్‌లింక్‌కు భారత్‌లో గ్రీన్ సిగ్నల్.. ఇంటర్నెట్ సేవలకు లైసెన్స్ జారీ
Starlink: ప్రముఖ టెక్ దిగ్గజం ఇలాన్ మస్క్ సారథ్యంలోని స్టార్‌లింక్ సంస్థకు భారత్‌లో సాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. కేంద్ర దూరసంచార శాఖ స్టార్‌లింక్‌కు ఈ సేవలు అందించడానికి లైసెన్స్‌ను మంజూరు చేసింది. సాటిలైట్ కమ్యూనికేషన్స్ సేవలు అందించడానికి జీఎంపీసీఎస్ లైసెన్స్ పొందిన మూడవ కంపెనీ స్టార్‌లింక్. ఇంతకుముందు యూటెల్‌సాట్ కు చెందిన వన్‌వెబ్ , రిలయన్స్ జియో ఈ అనుమతులను పొందాయి. ఇలాన్ మస్క్ స్టార్‌లింక్‌కు ఈ లైసెన్స్ లభించిన నేపథ్యంలో.. భారత్‌లో త్వరలోనే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ట్రయల్ స్పెక్ట్రమ్, భద్రతా నిబంధనలు!
దూరసంచార శాఖ స్టార్‌లింక్‌కు జీఎంపీసీఎస్ లైసెన్స్ ఇవ్వడమే కాకుండా, ట్రయల్ స్పెక్ట్రమ్‌ను కూడా అందించే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, స్టార్‌లింక్ ముందుగా ట్రయల్ స్పెక్ట్రమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అది అందిన మూడు, నాలుగు వారాల్లో స్పెక్ట్రమ్ జారీ చేయబడుతుంది. ఆ తర్వాత, ప్రభుత్వ భద్రతా నిబంధనలతో సహా అన్ని నియమ నిబంధనలను స్టార్‌లింక్ పాటిస్తుందా లేదా అని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ప్రభుత్వానికి సంతృప్తి కలిగించి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే స్టార్‌లింక్ సంస్థ వాణిజ్యపరంగా సాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించడానికి అనుమతి లభిస్తుంది.
'ఎన్ స్పేస్' అనుమతి కూడా తప్పనిసరి!
డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుండి అనుమతి లభించినప్పటికీ.. అంతరిక్ష రంగ నియంత్రణ సంస్థ అయిన ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN-SPACe - ఎన్ స్పేస్) కూడా అనుమతించాల్సి ఉంటుంది. స్టార్‌లింక్ సంస్థ ఇందుకోసం దరఖాస్తు చేసుకుని, అవసరమైన పత్రాలను కూడా సమర్పించింది. అయితే, ఎన్ స్పేస్ నుంచి ఇంకా అనుమతి లభించలేదు. ఇది లభించిన తర్వాతే పూర్తిస్థాయిలో సేవలు ప్రారంభమవుతాయి.
పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో ఇప్పటికే సేవలు
ఇలాన్ మస్క్ యాజమాన్యంలోని స్టార్‌లింక్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో సాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో కూడా ఈ సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. భారత్‌లో కూడా ఒకటి, రెండు నెలల్లో ఈ సేవలు ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు. గత నెలలో వచ్చిన నివేదికల ప్రకారం.. స్టార్‌లింక్ సంస్థ భారత్‌లో చాలా తక్కువ ధరలకే ఇంటర్నెట్ సేవలను అందించే అవకాశం ఉంది. దీని ప్లాన్‌లు నెలకు రూ.850 నుండి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. అపరిమిత డేటాను అందించడం ద్వారా భారత ఇంటర్నెట్ మార్కెట్‌లో పాగా వేయాలని స్టార్‌లింక్ యోచిస్తోంది. ఇది భారతీయ ఇంటర్నెట్ వినియోగదారులకు కొత్త అవకాశాలను, మరిన్ని ఆప్షన్లను అందిస్తుందని భావిస్తున్నారు.