Delivery Partner Salary Per Month: డెలివరీ బాయ్స్ గంటకు ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవుతారు..లెక్కలతో సహా చూడండి..!!

Delivery Partner Salary Per Month: డెలివరీ బాయ్స్ గంటకు ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవుతారు..లెక్కలతో సహా చూడండి..!!

Update: 2026-01-05 01:17 GMT

Delivery Boy Earning Per Month: ఫుడ్ డెలివరీ రంగంలో గిగ్ వర్క్ మోడల్‌పై కొనసాగుతున్న విమర్శలకు ముగింపు పలికే ప్రయత్నం చేశారు జొమాటో, బ్లింకిట్ పేరెంట్ కంపెనీ ఎటర్నల్ సీఈఓ దీపిందర్ గోయల్. గిగ్ వర్కర్లకు తగిన వేతనం లేదు, సామాజిక భద్రత కల్పించడం లేదన్న ఆరోపణలపై ఆయన తాజాగా సోషల్ మీడియా వేదిక X ద్వారా విస్తృతంగా స్పందించారు. వరుస పోస్టుల ద్వారా గణాంకాలతో సహా తన వాదనను వినిపించారు.

డెలివరీ పార్ట్‌నర్స్ సంపాదన క్రమంగా పెరుగుతోందని గోయల్ స్పష్టం చేశారు. 2024తో పోలిస్తే 2025లో జొమాటో డెలివరీ భాగస్వాముల సగటు ఆదాయం పెరిగిందని తెలిపారు. 2024లో గంటకు సగటున రూ.92 సంపాదన ఉండగా, 2025 నాటికి ఇది 10.9 శాతం పెరిగి గంటకు రూ.102కు చేరిందని వివరించారు. ఒక డెలివరీ భాగస్వామి రోజుకు 10 గంటలు, నెలకు సగటున 26 రోజులు పనిచేస్తే సుమారు రూ.26,500 గ్రాస్ ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. ఇందులో పెట్రోల్, వాహన నిర్వహణ వంటి ఖర్చులు తీసివేసినా నికర ఆదాయం సుమారు రూ.21 వేల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. అదనంగా కస్టమర్లు ఇచ్చే టిప్స్‌ను ఈ లెక్కల్లో చేర్చలేదని కూడా స్పష్టం చేశారు.

గిగ్ వర్క్‌ను పూర్తి స్థాయి ఉద్యోగంగా చూడటం సరికాదని గోయల్ మరోసారి నొక్కిచెప్పారు. ఇది ప్రధానంగా అదనపు ఆదాయ మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. 2025లో డెలివరీ పార్ట్‌నర్స్ సగటున ఏడాదిలో కేవలం 38 రోజులు మాత్రమే పనిచేశారని చెప్పారు. రోజుకు సగటున 7 గంటలపాటు మాత్రమే యాప్‌లో లాగిన్ అవుతున్నారని వివరించారు. మొత్తం డెలివరీ భాగస్వాముల్లో కేవలం 2.3 శాతం మంది మాత్రమే ఏడాదిలో 250 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు పని చేస్తున్నారని వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో పూర్తి స్థాయి ఉద్యోగులతో సమానంగా జీతాలు, ఇతర లాభాలు ఇవ్వాలన్న డిమాండ్ వాస్తవికం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

బ్లింకిట్ 10 నిమిషాల డెలివరీలపై వస్తున్న ప్రమాదాల ఆరోపణలను కూడా గోయల్ తోసిపుచ్చారు. తక్కువ సమయంలో డెలివరీ చేయాలన్న ఒత్తిడి వల్ల డెలివరీ పార్ట్‌నర్స్ వేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురవుతున్నారన్న వాదన సరైంది కాదన్నారు. బ్లింకిట్ స్టోర్లు కస్టమర్ లొకేషన్‌కు సగటున 2 కిలోమీటర్ల పరిధిలోనే ఉండటంతో, వేగంగా వెళ్లకుండానే 8 నిమిషాల్లో డెలివరీ చేయడం సాధ్యమవుతుందని వివరించారు. డెలివరీ సమయంలో సగటు వేగం గంటకు కేవలం 16 కిలోమీటర్లు మాత్రమేనని ఆయన తెలిపారు.

గిగ్ వర్కర్ల సామాజిక భద్రతపై కూడా స్పష్టత ఇచ్చారు. 2025లో జొమాటో, బ్లింకిట్ కలిసి డెలివరీ పార్ట్‌నర్స్ బీమా కోసం రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు చెప్పారు. ప్రతి డెలివరీ భాగస్వామికి రూ.10 లక్షల ప్రమాద బీమా కవరేజీ అందిస్తున్నామని తెలిపారు. మహిళా డెలివరీ పార్ట్‌నర్స్‌కు ప్రాధాన్యం ఇస్తూ నెలకు రెండు రోజులు వేతనంతో కూడిన సెలవులు కల్పిస్తున్నామని కూడా గోయల్ వెల్లడించారు.

Tags:    

Similar News