Bank Strike on January 27: జనవరి చివర్లో బ్యాంకులకు బంద్.. మూడు రోజులు సేవలకు అంతరాయం
జనవరి 27న UFBU పిలుపుతో దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె. 25, 26 సెలవులతో కలిపి మూడు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం.
Bank Strike on January 27: జనవరి చివర్లో బ్యాంకులకు బంద్.. మూడు రోజులు సేవలకు అంతరాయం
దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యే పరిస్థితి ఏర్పడింది.
జనవరి 25న సాధారణ వారపు సెలవు, 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉండటంతో, 27న జరగనున్న బ్యాంకుల సమ్మె కలిసివస్తే వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు మూతపడే అవకాశం ఉంది. దీంతో చెక్కుల క్లియరెన్స్, నగదు ఉపసంహరణలు, డిపాజిట్లు, కౌంటర్ సేవలు వంటి కీలక బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోవచ్చని అధికారులు తెలిపారు.
బ్యాంకింగ్ సేవలపై ఆధారపడే వ్యాపారులు, ఉద్యోగులు, పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లు ముందుగానే అవసరమైన ఆర్థిక లావాదేవీలను పూర్తిచేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా నగదు ఉపసంహరణలు, కీలక చెల్లింపులు, బిల్లుల సెటిల్‌మెంట్లు ఆలస్యం కాకుండా చూసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బ్యాంకు ఉద్యోగుల పని భారం తగ్గించడం, వృత్తి–వ్యక్తిగత జీవన సమతౌల్యం మెరుగుపరచడమే తమ డిమాండ్ ముఖ్య ఉద్దేశమని UFBU నేతలు తెలిపారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ స్పష్టమైన హామీ లభించలేదని పేర్కొన్నారు. తమ డిమాండ్లపై సానుకూల స్పందన రాకపోతే భవిష్యత్తులో మరింత ఆందోళనాత్మక కార్యక్రమాలకు సిద్ధంగా ఉన్నట్లు యూనియన్లు హెచ్చరించాయి.