Atal Pension Yojana : నెలకు రూ.42 కడితే చాలు..వృద్ధాప్యంలో నెలకు రూ.1,000 పెన్షన్ గ్యారెంటీ
నెలకు రూ.42 కడితే చాలు..వృద్ధాప్యంలో నెలకు రూ.1,000 పెన్షన్ గ్యారెంటీ
Atal Pension Yojana : అసంఘటిత రంగంలోని కార్మికులు, పేద, మధ్యతరగతి ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే అటల్ పెన్షన్ యోజనను కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్ల పాటు పొడిగించింది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకాన్ని కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా గౌరవంగా బతకాలనుకునే వారికి ఈ పథకం ఒక గొప్ప వరం. అతి తక్కువ ప్రీమియంతో నెలకు రూ.5,000 వరకు పెన్షన్ పొందే అవకాశం ఈ స్కీమ్ ద్వారా లభిస్తుంది.
భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం ఉంటుంది కానీ, ప్రైవేటు పనులు చేసుకునే వారికి, రోజువారీ కూలీలకు వృద్ధాప్యంలో ఎలాంటి ఆదాయం ఉండదు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజనను ప్రవేశపెట్టింది. తాజాగా ఈ పథకాన్ని 2030-31 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇది నేషనల్ పెన్షన్ సిస్టమ్ కంటే భిన్నమైనది. ఎన్పీఎస్‌లో మార్కెట్ రిస్క్ ఉంటుంది, కానీ అటల్ పెన్షన్‌లో మీకు వచ్చే పెన్షన్ మొత్తంపై ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. మీరు ఎంచుకున్న ప్లాన్ ప్రకారం నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ లభిస్తుంది.
ఎవరు అర్హులు? ఎలా చేరాలి?
18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల ఏ భారతీయ పౌరుడైనా ఈ పథకంలో చేరవచ్చు. అయితే దీనికి ఒక ముఖ్యమైన షరతు ఉంది - దరఖాస్తుదారు ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తి అయి ఉండకూడదు. ఆధార్ కార్డుతో లింక్ అయిన బ్యాంక్ సేవింగ్స్ ఖాతా, మొబైల్ నంబర్ ఉంటే సరిపోతుంది. మీరు కనీసం 20 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత మీరు ఎంచుకున్న పెన్షన్ మొత్తం మీ ఖాతాలో ప్రతి నెలా జమ అవుతుంది.
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం
ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే ప్రీమియం చాలా తక్కువ. ఉదాహరణకు మీరు 18 ఏళ్ల వయస్సులో ఈ పథకంలో చేరి నెలకు రూ.1,000 పెన్షన్ కావాలని కోరుకుంటే, మీరు చెల్లించాల్సిన నెలవారీ ప్రీమియం కేవలం రూ. 42 మాత్రమే. అదే నెలకు రూ.5,000 పెన్షన్ కావాలనుకుంటే, నెలకు రూ.210 చెల్లించాలి. మీరు పథకంలో చేరే వయస్సు పెరిగే కొద్దీ ప్రీమియం మొత్తం కూడా కొంచెం పెరుగుతుంది. అందుకే తక్కువ వయస్సులో చేరడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
కుటుంబానికి భద్రత
అటల్ పెన్షన్ యోజన కేవలం చందాదారుడికే కాకుండా వారి కుటుంబానికి కూడా భద్రతనిస్తుంది. ఒకవేళ పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే, అదే పెన్షన్ మొత్తం వారి జీవిత భాగస్వామికి (భార్య లేదా భర్త) అందుతుంది. దురదృష్టవశాత్తు వారిద్దరూ మరణిస్తే, చందాదారుడు నామినీగా పెట్టిన వ్యక్తికి ఇప్పటి వరకు జమ అయిన మొత్తం కార్పస్ ఫండ్‌ను ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. అంటే మీ పెట్టుబడి ఎక్కడికీ పోదు. ప్రభుత్వ గ్యారెంటీ ఉండటం వల్ల ఇది అత్యంత సురక్షితమైన పెట్టుబడి మార్గంగా పేరుగాంచింది.