Amazon Layoff : అమెజాన్‌లో మళ్ళీ లేఆఫ్స్ కలకలం..16 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన
అమెజాన్‌లో మళ్ళీ లేఆఫ్స్ కలకలం..16 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన
Amazon Layoff : అమెజాన్ ఉద్యోగులకు మళ్ళీ గడ్డు కాలం మొదలైంది. 2026 ప్రారంభంలోనే టెక్ దిగ్గజం అమెజాన్ తన కార్పొరేట్ విభాగంలో భారీ స్థాయిలో కోత విధిస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. సుమారు 16,000 మంది ఉద్యోగులపై ఈ వేటు పడనుంది. ఇది గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైన 30,000 ఉద్యోగాల తొలగింపు ప్రణాళికలో భాగంగా రెండో దశ అని తెలుస్తోంది. దీనివల్ల ముఖ్యంగా వైట్ కాలర్ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ నేతృత్వంలో కంపెనీని మరింత లీన్‌గా (తక్కువ మందితో ఎక్కువ పని) మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 2025లో సుమారు 14,000 మందిని ఇప్పటికే తొలగించారు. ఆ సమయంలో తొలగించిన వారికి ఇచ్చిన 90 రోజుల గడువు ముగియడంతో, ఇప్పుడు రెండో దశలో మరో 16,000 మందిని ఇంటికి పంపడానికి రంగం సిద్ధమైంది. జనవరి 27 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని సమాచారం. మేనేజ్‌మెంట్ పొరలను తగ్గించి, నిర్ణయాలు త్వరగా తీసుకునేలా సంస్థను మార్చడమే దీని ప్రధాన ఉద్దేశమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
ఈసారి తొలగింపుల ప్రభావం ఎక్కువగా అమెజాన్ వెబ్ సర్వీసెస్, ప్రైమ్ వీడియో, హెచ్ఆర్ విభాగమైన పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ పై ఉండబోతోంది. సాధారణంగా ఇతర కంపెనీల కంటే AWS ఎక్కువ లాభాలను తెచ్చిపెడుతుంది, కానీ ఇప్పుడు అక్కడ కూడా నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలని సంస్థ భావిస్తోంది. దీనికి తోడు పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్ కింద ఉన్న ఉద్యోగులకు మొదట నోటీసులు అందే అవకాశం ఉందని తెలుస్తోంది. భారతీయ ఐటీ కేంద్రాలైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలోని అమెజాన్ టీమ్స్‌పై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని అంచనా.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ఈ లేఆఫ్స్‌కు ప్రధాన కారణమని ఒక వైపు ప్రచారం జరుగుతుండగా, సీఈఓ ఆండీ జస్సీ మాత్రం ఇది కంపెనీ సంస్కృతిని మార్చే ప్రయత్నమని పేర్కొన్నారు. కంపెనీలో అనవసరమైన బ్యూరోక్రసీని తొలగించి, స్టార్టప్ తరహా వేగాన్ని పునరుద్ధరించాలని ఆయన భావిస్తున్నారు. ఏదేమైనా ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు పోవడం అనేది టెక్ ప్రపంచంలో ఆందోళన కలిగిస్తోంది.