8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ముందే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం అందుతుందా? పూర్తి వివరాలివే..!!

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ముందే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం అందుతుందా? పూర్తి వివరాలివే..!!

Update: 2026-01-07 05:33 GMT

8th Pay Commission: ఇటీవల 8వ వేతన సంఘంపై కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ముందడుగు వేయకముందే, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా పెద్ద నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం ప్రయోజనాలు అందుతాయా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠను రేపుతోంది. ఈ పరిణామాల్లో ముందుండి చరిత్ర సృష్టించిన రాష్ట్రం అస్సాం. దేశంలోనే తొలిసారిగా 8వ రాష్ట్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ జనవరి 1, 2026న ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు, సేవా నిబంధనలను సమీక్షించేందుకు ప్రత్యేకంగా 8వ రాష్ట్ర వేతన సంఘంను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కమిషన్‌కు మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి సుభాష్ దాస్ను చైర్మన్‌గా నియమించారు. ఈ నిర్ణయంతో, కేంద్ర ప్రభుత్వం కంటే ముందే వేతన సంఘాన్ని ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా అస్సాం గుర్తింపు పొందింది.

అస్సాం ప్రభుత్వం ఈ కమిషన్‌ను ముందుగానే ఏర్పాటు చేయడం ద్వారా వేగవంతమైన ప్రక్రియను ప్రారంభించినట్టే కనిపిస్తోంది. ఈ కమిషన్ ద్వారా రాష్ట్రంలోని సుమారు 7 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు జీతాలు, అలవెన్సులు, సేవా షరతులపై సమగ్ర సమీక్ష జరగనుంది. అయితే, కమిషన్ ఏర్పాటు అయినంత మాత్రాన వెంటనే వేతనాలు పెరుగుతాయన్న అర్థం కాదు. సాధారణంగా వేతన సంఘం తన అధ్యయనం పూర్తి చేసి, నివేదికను ప్రభుత్వానికి సమర్పించడానికి సుమారు 18 నెలల వరకు సమయం పడుతుంది. ఆ తర్వాతే ప్రభుత్వ క్యాబినెట్ ఆమోదంతో వేతన పెంపు అమలులోకి వస్తుంది.

కమిషన్ సిఫార్సులు సాధారణంగా జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా నిర్ణయించబడే అవకాశం ఉంది. అమలు ఆలస్యమైనా, ఉద్యోగులకు బకాయిలు (అరియర్స్) రూపంలో చెల్లించే విధానం కొనసాగుతుంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇది జనవరి 1, 2026 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత వేతన సంఘాల మాదిరిగానే, నివేదిక ఆలస్యమైనా ప్రయోజనాలు వెనుకబడి చెల్లించే విధానం ఉండనుంది.

నిపుణుల అంచనాల ప్రకారం, 8వ వేతన సంఘం అమలుతో ప్రాథమిక జీతాలు సుమారు 30 శాతం నుంచి 34 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.86 లేదా అంతకంటే ఎక్కువకు పెంచే అవకాశంపై చర్చలు జరుగుతున్నాయి. దీని ప్రభావంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న కనీస జీతం రూ.18,000, భవిష్యత్తులో రూ.35,000 నుంచి రూ.50,000 మధ్యకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే తరహా లాభాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తించే అవకాశముంది.

అస్సాం ప్రభుత్వం వేతన సంఘం ఏర్పాటు విషయంలో ముందడుగు వేసినప్పటికీ, వాస్తవంగా వేతన పెంపు ఎంత ఉంటుంది, ఎప్పటి నుంచి అమలవుతుంది అన్నది పూర్తిగా కమిషన్ సిఫార్సులు, రాష్ట్ర, కేంద్ర క్యాబినెట్ ఆమోదాలపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, ఉద్యోగుల సంక్షేమం విషయంలో అస్సాం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు కూడా దారితీసే అవకాశం ఉందని చెప్పవచ్చు.

Tags:    

Similar News