అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురవడం వల్ల, బోయింగ్ కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి. గురువారం ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో బోయింగ్ షేర్లు ఏకంగా 7 శాతానికి పైగా విలువ కోల్పోయాయి.
ఈ ప్రమాదంలో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అహ్మదాబాద్‌లోని మేఘానీనగర్ ప్రాంతంలో కుప్పకూలింది. విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రన్‌వే 23 నుంచి బయలుదేరిన అనంతరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. క్షణాల్లోనే విమానం కూలిపోయి, దట్టమైన నల్ల పొగలతో ఆ ప్రాంతం కమ్ముకుంది.
AI-171 అనే విమానం లండన్ గాట్విక్‌కు బయలుదేరింది. అందులో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, 3 చిన్నారులు సహా మొత్తం 242 మంది ఉన్నారు. సమాచారం ప్రకారం, విమానంలోని ప్రయాణికులంతా మృతిచెందినట్లు భావిస్తున్నారు.
ఇటీవలి కాలంలో బోయింగ్ 737 మ్యాక్స్ మరియు 787 మోడళ్ల భద్రతపై పలు విమర్శలు వచ్చిన నేపథ్యంలో, ఈ తాజా ప్రమాదం కంపెనీపై కొత్త ఒత్తిడిని రేపింది. ఇప్పటికే రెగ్యులేటరీ సంస్థలు, పెట్టుబడిదారుల గమనంలో ఉన్న బోయింగ్ కంపెనీకి ఇది మరో దెబ్బగా మారింది. బోయింగ్ షేరు ధరలో వచ్చిన ఈ భారీ పతనం, ఇలాంటి ప్రమాదాల వల్ల వచ్చే వ్యాపార, బ్రాండ్ నష్టాలపై ఇన్వెస్టర్లు కలిగిన ఆందోళనకు నిదర్శనంగా నిలిచింది.