Is YCP Ready To Give Posts: వైసీపీలో అసంతృప్తులకు జాబ్స్ రెడీనా?

Update: 2020-07-15 13:17 GMT

Is YCP ready to give posts : ఏపీలో మండలి రద్దుకే సీఎం జగన్ మొగ్గు చూపుతున్నారా? పార్టీలోని ఆశావాహులకు ప్రత్యామ్నాయ పదవులు కూడా రెడీ చేసేస్తున్నారా? టిడిపిని ప్యాక్ చెయ్యాలంటే, మండలి రద్దే అసలైన మంత్రమని బావిస్తున్నారా? వచ్చే రోజుల్లో మండలిలో తమ బలం పెరిగే అవకాశం ఉన్నా, ఇప్పట్లో మండలి వద్దంటే వద్దని డిసైడ్ అవుతున్నారా? మరి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన నేతలకు జగన్ ఏ పదవులిస్తారు? పార్టీ అసంతృప్తులను ఏ పదవులతో బుజ్జగించాలని డిసైడ్ అవుతున్నారు? 

ఆంద్రప్రదేశ్‌లో శాసనమండలి ఉండాలా వద్దా...రద్దు చేయడం బెటరా...లేక భావిరోజుల్లో సంఖ్యాబలం పెంచుకుని ముందుకు సాగడం మంచిదా అని ఆచితూచి ఆలోచిస్తున్న సిఎం జగన్ మదిలో, మండలి రద్దే బెటర్ ఆప్షన్ ఉందట. ఇప్పడున్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం బట్టి వచ్చే రోజుల్లో వైసీపీకి కూడా బలం పెరిగే అవకాశం ఉన్నా, ఇప్పుడు వైసీపీకి పంటి కింద రాయిలా తగులోంది మండలి. కౌన్సిల్‌లో టీడీపీకి మెజారిటీ వుండటం, ముందరికాళ్లకు బంధనం వేస్తోంది. అందుకే మండలి రద్దు బెటర్ అని డిసైడ్ అయ్యారట సీఎం జగన్.

అయితే సీఎంను, వైసీీపీలో ఆయన కీలక సన్నిహితులను కలిసిన వైసీపీ ఆశావాహులు, సీనియర్లు మండలి రద్దు అంశంపై అసంతృప్తితో ఉన్నారట. ఎలుకల బాధకు ఇల్లు తగులబెట్టడం ఎందుకనే సూచన ఇచ్చారట. ఉన్నపళంగా మండలిని రద్దు చేయడం వల్ల, టిడిపి జోరుకు అత్యంత వేగంగా కళ్లెం వేసినట్టవుతుందని సిఎం తన మనసులో మాటను చెప్పుకొచ్చారట. అయితే మండలిని రద్దు చేస్తే పార్టీ సీనియర్లకు, అసంతృప్తులకు ప్రత్యామ్నాయ పదవులు కూడా రెడీ చేశారట జగన్.

వివిధ కార్పోరేషన్లతో పాటు జిల్లాల విభజన మార్గంగా కనబడుతోందట. ఇప్పుడున్న 13 జిల్లాలను విభజన చేసి, 25 జిల్లాలుగా మార్చాలని సియం యోచిస్తున్న క్రమంలో, 25 జిల్లా పరిషత్‌లు, జిల్లా ఇన్‌చార్జులు పెరుగుతారు. అంతేకాక పెరిగిన జిల్లాల వారీగా నామినేటెడ్ పదవులు కూడా ఉండటంతో, ఆశావాహులు అందరికీ, సీట్లు కట్టబెట్టొచ్చు అనే ఆలోచనతో జగన్ ముందుకెళుతున్నారని పార్టీ ముఖ్యులు అంటున్నారట.

ఏడాది తరువాత టిడిపి స్థానాలు తగ్గుతాయని తెలిసినా, సియం జగన్ మాత్రం మండలి రద్దుకే మక్కువ చూపుతున్నారట. మండలి రద్దయితే, రాష్ట్రంలో టిడిపి MLAలు 20 మందే వుంటారు. అంతేకాక ఉన్నవారిలో చాలామంది వైసీపీ వైపు మొగ్గు చూపుతుండటంతో టిడిపికి ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. దీంతో టీడీపీని గట్టి దెబ్బతీయొచ్చనే ఆలోచన వున్న జగన్, మండలి రద్దుకు చకచకా పావులు కదుపుతున్నారట.

మూడు రాజధానుల బిల్లు, ఇంగ్లీషు మీడియం బిల్లుల విషయంలో అధికార వైసిపికి మండలిలో భంగపాటు ఎదురవ్వడంతో కఠిన నిర్ణయం తీసుకున్న జగన్, మండలి రద్దు తీర్మానాన్ని హుటాహుటిన శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు శాసనసభ కూడా ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో మండలి రద్దు నిర్ణయంపై చాలా సీరియస్‌గా జగన్ పావులు కదుపుతున్నారు. గతంలో కేంద్రం కూడా మిగిలిన రాష్ట్రాలలో మండలి రద్దుకు మొగ్గు చూపడంతో, జగన్ సర్కారుకు ఈ అంశం కలిసొచ్చేలా ఉందన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి మండలి రద్దు పరిహారంగా జిల్లాల పెంపుతో క్రియేటయ్యే పదవులతో, ఆశావహులను సంతృప్తి పరచాలన్నది సీఎం జగన్‌ ఆలోచనగా అర్థమవుతోంది. 

Tags:    

Similar News