Diwali Lakshmi Puja: దీపావళి లక్ష్మీ పూజ విధానం.. శాస్త్రోక్తంగా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించే పద్ధతి

దీపావళి 2025 లక్ష్మీ పూజ విధానం, మంత్రాలు, పూజా ఏర్పాట్లు, ప్రదక్షిణా విధి వివరాలు తెలుసుకోండి. ఇంట్లో శాస్త్రోక్తంగా దీపావళి లక్ష్మీ పూజ ఎలా చేయాలో పూర్తి మార్గదర్శిని.

Update: 2025-10-07 11:37 GMT

Diwali Lakshmi Puja: దీపావళి లక్ష్మీ పూజ విధానం.. శాస్త్రోక్తంగా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించే పద్ధతి

దీపావళి అంటే ఏమిటి?

దీపావళి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది దీపాలు వెలిగించడం, టపాసులు కాల్చడం, రుచికరమైన మిఠాయిలు తినడం. కానీ ఈ పండుగ వెనుక ఎన్నో పురాణగాథలు దాగి ఉన్నాయి. ఈ రోజు ముఖ్యంగా లక్ష్మీదేవి పూజ చేయడం ఆచారం. దేశం నలుమూలలా దీపావళి లక్ష్మీ పూజ విధానం కొద్దిగా తేడాగా ఉంటే, శాస్త్రోక్తంగా మన ఇంట్లోనే పూజ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

లక్ష్మీదేవి మహిమ

పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు శక్తి, మాయకు కారణం ఆయన పక్కన ఉన్న లక్ష్మీదేవి. భూదేవి కూడా ఆమె అవతారమేనని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో లక్ష్మీదేవిని మహాశక్తిగా వర్ణించారు. ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా పిలుస్తారు. భృగుమహర్షి కుమార్తె అయిన లక్ష్మీదేవి, దుర్వాస మహర్షి శాపం కారణంగా క్షీరసాగర మథనం సమయంలో ఉద్భవించింది. అప్పటి నుండి శ్రీమహావిష్ణువుకు తోడుగా ఈ సృష్టిని పాలించడంలో భాగమైందని పురాణాలు చెబుతున్నాయి.

దీపావళి లక్ష్మీ పూజకు ముందుగా చేయాల్సిన ఏర్పాట్లు

ఇంటిని పూర్తిగా శుభ్రం చేసి, పూలతో, రంగవల్లులతో, దీపాలతో అలంకరించాలి.

పూజగదిలో ఈశాన్య దిశలో పీఠం ఏర్పాటు చేసి, ఎర్రని వస్త్రం వేయాలి.

ఆ పీఠంపై గణపతి మరియు లక్ష్మీదేవి విగ్రహాలను ఉంచాలి.

పీఠంపై కలశాన్ని స్థాపించి, దీపాలు వెలిగించాలి.

పూలు, పండ్లు, స్వీట్లు, పిండి వంటకాలు నైవేద్యంగా సమర్పించాలి.

మొదట గణపతి పూజ చేసి, ఆ తరువాత లక్ష్మీదేవి పూజ చేయాలి.

పూజలో చదవవలసిన మంత్రాలు

గణపతి పూజా మంత్రం:

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

దీపారాధన:

దీపత్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః

సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహిమే

ఈ మంత్రాల తరువాత ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా అంటూ బెల్లం లేదా నైవేద్యం సమర్పించాలి.

ప్రాణ ప్రతిష్ట మంత్రం:

రక్తాం భోధిస్థపోతోల్లసదరుణ సరోజాధిరూఢాకరాబ్జైః

పాశంకోదండ మిక్షూద్భవ మళిగుణమప్యం కుశం పంచబాణాన్

బిబ్రాణా సృక్కపాలం త్రిణయన విలసత్ పీన వక్షోరుహాఢ్యా

దేవీ బాలార్కవర్ణాభవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః

లక్ష్మీదేవి ఆధాంగ పూజ

(ఈ క్రమంలో శరీర భాగాల పూజ చేయాలి)

చంచలాయై నమః – పాదౌ పూజయామి

చపలాయై నమః – జానునీ పూజయామి

పీతాంబరధరాయై నమః – ఊరూ పూజయామి

కమలవాసిన్యై నమః – కటిం పూజయామి

పద్మాలయాయై నమః – నాభిం పూజయామి

మదనమాత్రే నమః – స్తనౌ పూజయామి

లలితాయై నమః – భుజద్వయం పూజయామి

కంబుకంఠ్యై నమః – కంఠం పూజయామి

సుముఖాయై నమః – ముఖం పూజయామి

శ్రియై నమః – ఓష్ఠౌ పూజయామి

సునాసికాయై నమః – నాసికం పూజయామి

సునేత్రాయై నమః – నేత్రే పూజయామి

రమాయై నమః – కర్ణౌ పూజయామి

కమలాలయాయై నమః – శిరః పూజయామి

ఓం శ్రీలక్ష్మీదేవ్యై నమః – సర్వాంగ పూజయామి

ప్రదక్షిణా మంత్రం

యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే

పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ

త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ

తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వరి

శ్రీలక్ష్మీదేవ్యై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

పూజ ముగింపు

నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే

పాహిమాం భక్తవరదే శ్రీలక్ష్మయితే నమో నమః

ఈ మంత్రంతో సాష్టాంగ నమస్కారం చేసి పూజను ముగించాలి.

గమనిక:

ఈ కథనంలోని వివరాలు మత విశ్వాసాలు, పురాణ వచనాల ఆధారంగా ఉన్నాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. విశ్వసించాలా వద్దా అనేది మీ వ్యక్తిగత నిర్ణయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.

Tags:    

Similar News