Raja Yoga 2026: ఈ 6 రాశుల వారికి అఖండ అదృష్టం.. పట్టిందల్లా బంగారం!
Raja Yoga 2026: ఫిబ్రవరిలో గురు–బుధ గ్రహ దృష్టితో అఖండ రాజయోగం ఏర్పడుతోంది. మేష, వృషభ, మిథున, సింహ, తుల, కుంభ రాశులకు ధనం, పదోన్నతులు, లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.
Raja Yoga 2026: ఈ 6 రాశుల వారికి అఖండ అదృష్టం.. పట్టిందల్లా బంగారం!
Raja Yoga 2026: జ్యోతిషశాస్త్రం ప్రకారం ఫిబ్రవరి నెలలో అరుదైన అఖండ రాజయోగం ఏర్పడుతోంది. జ్ఞాన కారకుడైన గురువు, విజ్ఞాన కారకుడైన బుధుడిని నవమ దృష్టితో వీక్షించడం వల్ల రాజయోగం, అధికార యోగం, ధన యోగం ఒకేసారి ఫలించనున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు గ్రహాల మధ్య త్రికోణ సంబంధం ఏర్పడడం వల్ల కలలో కూడా ఊహించని స్థాయిలో పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఫిబ్రవరి 4న బుధుడు కుంభ రాశిలో ప్రవేశించి రెండు నెలల పాటు అక్కడే సంచరించనున్నాడు. ఈ సమయంలో మిథున రాశి నుంచి గురువు బుధుడిపై దృష్టి వేయడం వల్ల అనేక రాశుల జీవితాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా మేషం, వృషభం, మిథునం, సింహం, తుల, కుంభ రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుందని జ్యోతిష్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మేషం
లాభ స్థానంలో ప్రవేశించిన బుధుడిని గురువు వీక్షించడం వల్ల మార్చి నెలాఖరు వరకు ఆదాయం స్థిరంగా పెరుగుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.
వృషభం
ధనాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో సంచారం చేయడం, దానిని ధన స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల అపార ధన లాభ యోగం కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ఉద్యోగ సంస్థకు మీ వల్ల లాభాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయ వృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది.
మిథునం
భాగ్య స్థానంలో ఉన్న రాశ్యధిపతి బుధుడిపై గురు దృష్టి పడటంతో ఆదాయానికి లోటుండదు. ఆర్థిక సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానం దక్కే అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు లభిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పితృ సంపద పొందే యోగం ఉంది.
సింహం
సప్తమ స్థానంలో ఉన్న ధన, లాభాధిపతి బుధుడిని గురువు వీక్షించడం వల్ల ఉద్యోగంలో రాజయోగం కలుగుతుంది. పదోన్నతులు, అధికార యోగానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో రెండుసార్లు ధన లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. విదేశీ ఉద్యోగం, విదేశీ సంపాదన యోగం ఉంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
తుల
పంచమ స్థానంలో ఉన్న బుధుడిపై భాగ్య స్థానం నుంచి గురు దృష్టి పడటంతో అదృష్టం పూర్తిగా అనుకూలిస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. సంపద వృద్ధి చెందుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కుంభం
ఈ రాశిలో సంచరిస్తున్న బుధుడిని పంచమ స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాల ద్వారా అంచనాలకు మించిన లాభాలు పొందుతారు. ఉద్యోగంలో ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. చేపట్టిన ప్రతి ప్రయత్నం విజయవంతమవుతుంది.
గమనిక: ఇది జ్యోతిష్య విశ్లేషణ ఆధారంగా ఇవ్వబడిన సమాచారం మాత్రమే.