ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి ఝలక్ ఇస్తారా!

Update: 2019-12-05 01:55 GMT

ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ ను మొదలుపెట్టింది వైసీపీ. బలమైన నేతలను తమవైపునకు తిప్పుకునే దిశగా పావులు కదుపుతోంది. ప్రకాశం జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే ప్రస్తుతం వైసీపీలో చేరేందుకు దాదాపు సిద్ధమయ్యారన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ తరుపున ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి గెలిచిన గొట్టిపాటి రవికుమార్, కొండెపి నుంచి గెలిచిన డోలా బాలవీరాంజనేయస్వామి వైసీపీలో చేరుతారని ప్రచారం ఊపందుకుంది. అయితే వైసీపీలో చేరాలంటే కండిషన్స్ అప్లై అంటున్నారట గొట్టిపాటి రవికుమార్. తనకు చెందిన గ్రానైట్ క్వారీల్లో విజిలెన్స్ దాడులు ఆపాలి, అలాగే తనకే భవిశ్యత్ లో టిక్కెట్ ఇవ్వడమే కాకుండా పర్చూరు నియోజకవర్గానికి తన అన్న కుమారుడైన గొట్టిపాటి భరత్ ను ఇంఛార్జిగా నియమించాలని కండిషన్ పెట్టారట. అయితే పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సైతం వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఒకవేళ అతను నిజంగానే వైసీపీలో చేరితే గొట్టిపాటి భరత్ కు ఇంచార్జ్ పదవి కష్టమేనని చెబుతున్నారట.. మిగతా విషయాల్లో ఫేవర్ గానే చేస్తామని రవికుమార్ కు హామీ ఇచ్చారట వైసీపీ నేతలు. దీంతో రవికుమార్ వైసీపీలో చేరటం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. మరోవైపు కొండెపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి చేరికకు లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడినుంచి పోటీ చేసిన మాదాసి వెంకయ్యను ప్రకాశం జిల్లా డీసీసీబీ చైర్మన్ గా నియమించారు. అయితే ఇటీవల పార్టీలో చేరిన జూపూడి ప్రభాకర్ కూడా కొండెపి ఇంచార్జ్ పదవిని ఆశిస్తున్నారు. ఇక గుంటూరు జిల్లాలో టెక్స్టైల్ వ్యాపార రంగంలో నిలదొక్కుకున్న టీడీపీ ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. జిల్లా మంత్రి మోపిదేవి వెంకటరమణతో ఆ ఎమ్మెల్యే చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు గోడ దూకేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ ప్రచారాన్ని సదరు ఎమ్మెల్యేలు ఖండించకపోవడంతో పార్టీ మారడం ఖాయమనే సంకేతాలు అందినట్టయింది.

Tags:    

Similar News