టీడీపీ నేతలు ప్రజలను మోసం చేశారు : దేవినేని అవినాష్

Update: 2020-05-15 04:44 GMT

టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు వైసీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్. టీడీపీ నేతలు ప్రజలను మోసం చేశారు కాబట్టే గత ఎన్నికల్లో 23 సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలు విద్యుత్ ఛార్జీలుపై అసత్య ప్రచారం చేస్తున్నాయని, విద్యుత్ చార్జీలు పెరిగాయని ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్నారని విమర్శించారు. టీడీపీ అంటే ప్రతిపక్ష పార్టీ కాదు, జూమ్ కాల్ పార్టీగా మారిందని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు.

విద్యుత్ చార్జీలు పెరిగాయన్నది అవాస్తవమన్నారు. రెండు నెలలకు కలిసి రీడింగ్ తీసినా రెండు నెలలకు వేర్వేరుగా బిల్లులు ఇచ్చారని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా విద్యుత్ వినియోగం పెరిగిందని, 500 యూనిట్లు కంటే ఎక్కువ వాడిన వారికి మాత్రమే అదనంగా యూనిట్ కు 90 పైసలు అధికంగా పడిందని తెలిపారు. ఎస్సి ఎస్టీలకు 200 యూనిట్లు వరకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నారని అవినాష్ వివరించారు. జూన్ 30 తేదీ వరకు కరెంట్ బిల్లులు చెల్లించే అవకాశం సీఎం కల్పించారని ఆయన తెలిపారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ చార్జీలు పెంచారని గుర్తుచేశారు. టీడీపీ నాయకులు ఇళ్లలో సినిమాలు చూస్తూ దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు.

Tags:    

Similar News