ప్రతిభగల విద్యార్థులకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం పేరిట అందజేస్తున్న ప్రతిభా పురస్కారాల పేరును అధికారులు మార్చేసిన విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన దృష్టికి రాకుండా పేరు మార్చడంపైన తీవ్రంగా స్పందించారు. ప్రతిభా పురస్కారాల పేరు మారుస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని ఆదేశించారు.ప్రతిభా పురస్కారాలకు యథాతథంగా అబ్దుల్ కలాం పేరునే పెట్టాలని అధికారులకు సూచించారు. కొన్ని నిమిషాల్లోనే ఈ పని పూర్తి చెయ్యాలని హెచ్చరించారు.
అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేసే అవార్డులకు దేశంలోని మహానీయులు పేర్లు కూడా పెట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహాత్మ గాంధీ, జ్యోతిరావ్ పూలే, అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ వంటి మహానీయుల పేర్లతో అవార్డులు ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు. కాగా భారత మాజీ రాష్ట్రపతి అబ్దు కలాం పేరిట ఇస్తున్న 'డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కార్' అవార్డుల పేరును 'వైయస్సార్ విద్యా పురస్కారాలు'గా ఏపీ ప్రభుత్వ అధికారులు మార్చేశారు.ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.