నారాయణ కుటుంబానికి అండగా ఉంటా: సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత సహాయ కార్యదర్శి దంపెట్ల నారాయణ అనారోగ్యంతో మృతి చెందారు.

Update: 2019-12-06 12:25 GMT
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత సహాయ కార్యదర్శి దంపెట్ల నారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం అనంతపురం జిల్లా దిగువపల్లి గ్రామం. సహాయకుడి మరణవార్త తెలుసుకున్న సీఎం జగన్ ఢిల్లీనుంచి హుటాహుటిన దిగువపల్లి చేరుకొని నారాయణ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు.అనంతరం నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సీఎం సతీమణి వైఎస్ భారతి కూడా నారాయణ మృతదేహానికి నివాళులు అర్పించారు.

నారాయణ మృతి చెందడంతో వైఎస్‌ జగన్‌ తన ఢిల్లీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని ఢిల్లీ నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. కడప నుంచి హెలికాప్టర్‌లో అనంతపురం జిల్లా దిగువపల్లెకు వెళ్లారు . నారాయణ పార్థివదేహానికి మంత్రి శంకర్ నారాయణ, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కదిరి ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే బి.గుర్నాథ్ రెడ్డి, ఆయన సోదరుడు ఎర్రిస్వామిరెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ తాడిమర్రి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళర్పించారు.

Tags:    

Similar News