YSRCP About Amit Shah: అంబేద్కర్‌ను కించపరిస్తే అది తప్పే.. కానీ.. అమిత్ షా వ్యాఖ్యలపై వైసీపీ రియాక్షన్
YS Jagan led YSRCP reveals its stand on Amit Shah speech about BR Ambedkar name: పార్లమెంట్‌లో అంబేద్కర్ పేరు తీస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు గత నాలుగు రోజులుగా పార్లమెంట్‌లో రగడకు దారితీశాయి. అమిత్ షా వ్యాఖ్యలను ఇండియా బ్లాక్ కూటమిలోని పార్టీల సభ్యులు తప్పుపడుతున్నారు. వివిధ రాజకీయ పార్టీల అధినేతలు, నేతలు కూడా ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని వినిపిస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్‌సీపీ కూడా అమిత్ షా వ్యాఖ్యలపై స్పందిస్తూ ఒక ట్వీట్ చేసింది.
“వాళ్లు అంబేద్కర్ పేరును వందసార్లు అంటారు.. అన్నిసార్లు దేవుడ్ని పేరు తలుచుకుంటే పుణ్యం వస్తుందన్నట్టుగా’’ అమిత్ షా మాట్లాడిన మాటలు అపోహలకు దారితీశాయని ఆ పార్టీ తమ ట్వీట్‌లో పేర్కొంది. కాని, ఆ తర్వాత అంబేద్కర్ గురించి కొనసాగింపుగా అమిత్ షా అన్న మాటలు, బీజేపీ సభ్యులు మాట్లాడిన మాటలు, ప్రధాని మోదీ మాట్లాడిన మాటలు గమనిస్తే అందరూ అంబేద్కర్‌ను గౌరవిస్తూ కొనియాడడం కనిపించిందని వైసీపీ అభిప్రాయపడింది. అది ఒక మంచి పరిణామంగా వైసీపీ అభివర్ణించింది.
అంబేద్కర్‌ను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కించపరిచినా, పల్లెత్తు మాట అన్నా అది తప్పే అవుతుందని వైసీపీ ట్వీట్ చేసింది. పేదవాడికి సమాన హక్కులు, గౌరవం ఉండాలనే అంబేద్కర్ భావజాలం తమ పార్టీకి ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆ పార్టీ చెప్పుకొచ్చింది. ఆ స్ఫూర్తి పరిఢవిల్లేలా విజయవాడ నగరం నడిబొడ్డున ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని వైయస్సార్‌సీపీ ప్రభుత్వం నిలబెట్టి అద్భుతమైన స్మృతివనాన్ని నిర్మించినట్లు గుర్తుచేశారు. అంబేద్కర్ వైఎస్ఆర్‌సీపీకే కాకుండా యావత్ భారత దేశానికి చిరకాలం ఆదర్శంగా నిలుస్తారని ఆ పార్టీ తెలిపింది.