జగన్ కంపెనీ డొంక కదులుతుందా?

Update: 2024-10-29 16:30 GMT

అన్నా చెల్లెళ్ల వార్ చంద్రబాబుకు కలిసొస్తుందా?

సరస్వతి పవర్ సంస్థలో అటవీభూములెన్ని?

అసలు పర్యావరణ అనుమతులు ఉన్నాయా?

సున్నపురాయి మైనింగ్ సంగతేమిటి?

భూముల స్వాధీనం, లీజు రద్దు దిశగా ప్రభుత్వం… రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం… ముమ్మరంగా కొనసాగుతున్న సర్వే.

షర్మిల తీగ లాగారు. పవన్ కళ్యాణ్ ద్వారా జగన్ కంపెనీ డొంక చంద్రబాబు కదిలిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చెందిన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ సంస్థలో అక్రమణలు, అనుమతులు, ఫారెస్ట్, ఇరిగేషన్, పోరంబోకు భూముల కబ్జాపై ప్రభుత్వం ఇపుడు ఆరా తీస్తోంది. మరో వైపు విజయమ్మ రాసిన బహిరంగ లేఖ వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులను అయోమయంలో పడేసింది.

అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు...

అన్నా చెల్లెళ్లయిన జగన్, షర్మిల ప్రాపర్టీ వార్‌కు వేదికగా మారిన సరస్వతీ పవర్ అండ్ ఇన్‌ఫ్రాలో ఆక్రమణలపై సర్వే మొదలైంది. వందలాది ఎకరాల అటవీ భూములను తమ సంస్థలో కలిపేసుకున్నారని ఎప్పటి నుంచో వస్తున్న ఆరోపణలు నిగ్గు తేల్చేందుకు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కదిలింది. సాంకేతికంగా అటవీ మంత్రి పవనే కనుక ఆయన ఆదేశాలు జారీ చేశారు. తెరవెనుక కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ అంతా చంద్రబాబుదేనని వైసీపీ భావిస్తోంది.

జగన్‌ను ఎలాగైనా ఇరుకున పెట్టాలన్న ఉద్దేశ్యంతోనే ఇదంతా చేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు సరస్వతీ పవర్ సంస్థ విస్తరించి ఉన్న పల్నాడు జిల్లా మాచవరం, దాచేపల్లి మండలాల్లో అధికారులు ముమ్మరంగా సర్వే చేస్తున్నారు. సంస్థ విస్తరించి ఉన్న 1515.93 ఎకరాల్లో వాగులు, వంకలు, కొండ పోరంబోకు భూములున్నట్టు వచ్చిన ఆరోపణలపైనే కాకుండా అసలు ఆ సంస్థ నెలకొల్పటానికి గతంలో వచ్చిన పర్యావరణ అనుమతులపై కూడా ప్రభుత్వం ఆరా తీస్తోంది.

పర్యావరణ అనుమతులు ఉన్నాయా?

ఈ భూముల్లో పరిశ్రమ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ఉన్నా? ఉంటే ఎన్ని ఎకరాల విస్తీర్ణం వరకు అనుమతులున్నాయి? సంస్థ విస్తరించి ఉన్న మొత్తం భూమి, ఫ్యాక్టరీలకు సంబంధించి పొందిన కాలుష్య, అటవీ, పర్యావరణ అనుమతులపై కూడా ప్రభుత్వం నిఘా ఉంచింది. అటవీ, పర్యావరణ శాఖతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను కూడా ప్రభుత్వం రంగంలోకి దింపింది. అంతేకాదు.. కృష్ణా నది నుంచి తమ సంస్థకు కేటాయించుకున్న 0.0689 టీఎంసీల జలాలపైనా ప్రభుత్వం సమీక్ష చేయనుంది. సర్వే అధికారులు ఒకటి రెండు రోజుల్లో ప్రాథమిక నివేదిక అందించగానే దీనిపై పవన్ కళ్యాణ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించేందుకు నిర్ణయించినట్టు సమాచారం.

సరస్వతి ఇండస్ట్రీస్ క్విడ్ ప్రోకోలో భాగమా...

వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి అయిన తరువాత 2009 మే 18న సరస్వతి పవర్‌ సంస్థకు 1,515.93 ఎకరాల్లో సున్నపు రాయి నిక్షేపాల్ని లీజుకు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. భూములను స్వాధీనం చేసుకున్న సరస్వతి సంస్థ సున్నపు రాయి వెలికితీసే పని మాత్రం చేపట్టలేదు. గడువులోపు సున్నపురాయి మైనింగ్ ఫనులు చేయనందున 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం లీజును రద్దు చేసింది. 2019లో అధికారం దక్కించుకున్న జగన్ తన కంపెనీ లీజును తిరిగి పునరుద్ధరించుకున్నారు. ఇపుడా భూముల విలువ 220 కోట్ల రూపాయలు ఉంటుందని ఒక అంచనా.

అంతకుమించి లీజు పేరుతో జగన్ ఆధీనంలోనే ఉన్న సున్నపురాయి గనుల విలువ 10,380 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఒక ఎకరా విస్తీర్ణంలో ఒక లక్షా 70 వేల టన్నుల సున్నపురాయి లభిస్తుందనీ, సిమెంటు ఉత్పత్తిలో వినియోగించే టాప్ గ్రేడ్ సున్నపురాయి ధర మార్కెట్లో టన్ను నాలుగు వందల రూపాయలు ఉందని అధికారులు లెక్క తేల్చారు. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రోకో పద్దతిలో జగన్ వేల కోట్ల ఆస్తులను ఆయాచితంగా సంపాదించాడన్న ఆరోపణలపై సీబీఐ కోర్టులో కేసు నడుస్తోంది.

ఆస్తులను అటాచ్ చేస్తున్న ఈడీ

మరో వైపు కొన్ని ఆస్తులను అటాచ్‌మెంట్ చేసి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ - ఈడీ కూడా విచారణ చేపడుతోంది. ఈడీ అటాచ్ చేస్తున్న ఆస్తుల్లో సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ కూడా ఉంది. అన్నా చెల్లెల మధ్య ప్రస్తుతం నడుస్తున్న హైడ్రామా వార్‌కు ఇదే ప్రధాన కారణం.

ఈడీ అటాచ్ చేస్తున్న ఆస్తులను బదలాయించకూడదని తెలిసినా నిబంధనలకు విరుద్ధంగా షర్మిల వ్యవహరించారని, చంద్రబాబుతో కుమ్మక్కై ఆయన డైరెక్షన్ మేరకు తన షేర్లను బదలాయించారని జగన్ అంటున్నారు. అలా చేయడం వల్ల తన బెయిల్ రద్దయ్యే అవకాశం కూడా ఉంటుందని ఆయన భావిస్తున్నారు. అందుకే, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్.. ఎన్ సీ ఎల్ టిని ఆశ్రయించినట్టు జగన్ చెబుతున్నారు.

కంపెనీ భూములు, సున్నపురాయి నిక్షేపాల విలువ భారీగా పెరిగినందున వాటిని తనకు ఇవ్వకూడదని జగన్ ఇలా అడ్డం తిరిగారనీ, తల్లినీ, చెల్లిని కోర్టుకు ఈడ్చారని షర్మిల వాదిస్తోంది. షర్మిల వాదననను తెలుగుదేశం పార్టీ బహిరంగంగానే సమర్ధిస్తోంది. జగన్‌ను ఆర్థికంగా, నైతికంగా దెబ్బతీసే రాజకీయ వ్యూహాన్ని తెలుగుదేశం పక్కాగా అమలు చేస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

విజయమ్మ బహిరంగ లేఖ

ఇదిలా ఉంటే, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ అక్టోబర్ 29న ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆస్తుల విషయంలో జరుగుతున్న పరిణామాలు తనకు కంటతడి పెట్టిస్తున్నాయని, వైఎస్ బతికి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులను ఉద్దేశించి రాసిన ఆ బహిరంగ లేఖలో ఆమె, ఇద్దరు బిడ్డలకు ఆస్తులు సమానంగా పంచాలనేది వైఎస్ఆర్ కోరిక అని పేర్కొన్నారు. ఈ ఆస్తులను బాధ్యత గల కొడుకుగా జగన్ సంరక్షించాలన్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయన్న విజయమ్మ, ఈ వివాదంపై ఇటీవల వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలేనని తెలిపారు. తాను ఎంత ప్రయత్నించినా జరగకూడనివన్నీ తన ముందే జరిగిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిగా అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండడం తన బాధ్యత అని కూడా విజయమ్మ ఆ లేఖలో పేర్కొన్నారు.

లీజు రద్దవుతుందా?

మొత్తం ఈ పరిణామాల వల్ల జగన్‌కు కష్టాలు, నష్టాలు ఎదురుకావచ్చేమో గానీ షర్మిలకు అదనంగా వచ్చే ప్రయోజనమేమీ లేదనీ, సరస్వతి పవర్ సంస్థలో అటవీ భూములున్నాయని నిర్ణారణ అయితే, పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలు ఉన్నట్టు ఖాయమైతే లీజు రద్దు చేయటంతో పాటు భూముల స్వాధీనానికి ప్రభుత్వం పూనుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. షర్మిలను అడ్డం పెట్టుకుని పవన్ భుజం మీద నుంచి జగన్‌కు తుపాకి గురిపెట్టే రాజకీయ ఆట మొదలైందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఈ మొత్తం వివాదంపై విజయమ్మ రాసిన పూర్తి బహిరంగ లేఖ 







Tags:    

Similar News