BY-Elections: తిరుపతి ఉప సమరానికి సిద్ధమవుతోన్న వైసీపీ

BY-Elections: ఎన్నిక నగారా మోగడంతో ప్రచారంపై ఫోకస్ పెట్టింది * గెలుపు మాదే అంటూ ధీమాలో ఉన్న వైసీపీ

Update: 2021-03-19 07:40 GMT

ఫైల్ ఫోటో 

BY-Elections: తిరుపతి ఉప సమరానికి వైసీపీ సిద్ధమవుతోంది. ఎన్నిక నగారా మోగడంతో ప్రచారంపై ఫోకస్ పెట్టింది. అయితే మునుపటి ఎన్నికల కంటే భిన్నంగా బైపోల్‌పై దృష్టి పెట్టింది అధికార పార్టీ. గెలుపు మాదే అంటూ ధీమాలో ఉన్న వైసీపీ ఈసారి మెజారిటీపై దృష్టిపెట్టాలని పార్టీ నేతలకు సూచిస్తోంది.

ఏపీలో మరో సమరానికి రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. మరికొద్ది రోజుల్లో జరగనున్న తిరుపతి ఉప సమరంలో బలాబలాలు నిరూపించుకునేందుకు సన్నద్ధమవుతున్నాయి. వైసీపీ, టీడీపీ, బీజేపీ-జనసేన కూటమి మధ్య బైపోల్‌లో త్రిముఖ పోరు జరగనుంది. అయితే తిరుపతి ఉపఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసిన వైసీపీ ఇక ప్రచార కార్యక్రమాలపై కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నిక ఏదైనా సీరియస్ గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్న వైసీపీ ఆ దిశగా పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేస్తోంది. ఇప్పటివరకు జరిగిన పంచాయతీ, మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావడంతో తిరుపతి కూడా తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది అధికార పార్టీ.

తిరుపతి లోక్‌సభ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలను నిరంతరం ప్రచారంలో ఉండాలని పార్టీ అధిష్టానం సూచించింది. ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నేతలు మంత్రులు కూడా ప్రచారం చేయాలని తెలిపింది. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేయనున్నారు నేతలు. ప్రచారానికి సంబంధించి పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రోడ్ మాప్ తయారు చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికలో తమ అభ్యర్థిగా ప్రకటించిన గురుమూర్తి విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలే తనను గెలిపిస్తాయని చెబుతున్నారు.

మరోవైపు తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో గెలుపు కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. టీడీపీ తిరుపతిలో అయినా విజయకేతనం ఎగరవేయాలని భావిస్తుంటే. తిరుపతి ఉప ఎన్నికతో ఏపీలో బలోపేతం అయ్యేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అయితే గెలుపు మాత్రం మాదే అంటోంది వైసీపీ. ఈ సారి గతంలో వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువగా సాధించాలనే తపన తో ప్రచారం నిర్వహించాలనే ఆలోచనతో ముందుకెళ్తోంది. 

Tags:    

Similar News