ఎట్టకేలకు ముగిసిన గన్నవరం పంచాయితీ

Update: 2019-12-06 03:06 GMT

గన్నవరం నియోజకవర్గ సంక్షోభానికి వైసీపీ నాయకత్వం ముగింపు పలికింది. గన్నవరం నియోజకవర్గం ఇన్‌చార్జి యర్లగడ్డ వెంకటరావును కృష్ణ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (కెడిసిసి) చైర్మన్‌గా నియమించడం ద్వారా సమస్యకు పరిష్కారం చూపినట్లయింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ టీడీపీ నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో ఆయనను ఆ పార్టీనుంచి సస్పెండ్ చేశారు. ఆ తరువాత వంశీ వైసీపీకి మద్దతు పలికారు. అంతకుముందునుంచే వంశీ ఎపిసోడ్ పట్ల అసంతృప్తిగా ఉన్న యార్లగడ్డ.. ఈ పరిణామంతో మరింత అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినాయకత్వంతో భేటీ అయ్యారు. అయితే సీఎం జగన్, మంత్రులు బుజ్జగించడంతో అలకవీడారు. ఈ క్రమంలో ఆయనకు కెడిసిసి బ్యాంక్ చైర్మన్ పదవి ఇచ్చిన తరువాత క్యాడర్ లో కొంత ఉత్సాహం నెలకొంది.

గతంలోనే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. రాష్ట్ర సహకార సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ పదవి ఆ తరువాత ఎమ్మెల్సీ పదవి ఇస్తానని వెంకటరావుకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ముందుగా కెడిసిసిబి ఇచ్చినట్టు తెలుస్తోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో పార్టీ నేతలు దుట్టా రామచందర్ రావు, వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకటరావులు కలిసి పనిచేస్తారని క్యాడర్ కు కూడా సంకేతాలు అందాయి. కాగా 2014 ఎన్నికల్లో గన్నవరంలో వైసీపీ తరపున దుట్టా రామచందర్ రావు పోటీ చేశారు. ఆ తరువాత 2019 లో పోటీ చేయలేనని తేల్చి చెప్పడంతో యార్లగడ్డ వెంకటరావును బరిలోకి దింపింది వైసీపీ. టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ చేతిలో 700 వందల స్వల్ప ఓట్ల తేడాతో ఆయన ఓటమి చెందారు. 

Tags:    

Similar News