World Class Infrastructure in Araku: అరకులో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు.. ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశం

World Class Infrastructure in Araku: ఏపీలో పర్యాటకానికి చిరునామాగా ఉన్న అరకులో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రపంచ స్థాయిలోనే గుర్తింపువచ్చేట్టు..

Update: 2020-08-21 03:38 GMT

World Class Infrastructure in Araku

World Class Infrastructure in Araku: ఏపీలో పర్యాటకానికి చిరునామాగా ఉన్న అరకులో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రపంచ స్థాయిలోనే గుర్తింపువచ్చేట్టు తీర్చిదిద్దాలని సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపుగా 12 నుంచి 14 ప్రాంతాలను పర్యాటకానికి ముందంజలో ఉంచేట్టు చేయాలన్నారు. దీనికి అవసరమైన నిధులు సమీకరణలో భాగంగా ప్రైవేటు సంస్థలభాగస్వామ్యం తీసుకోవాలని సూచించారు.

పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేవారికి అనువుగా నూతన పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఏపీ టూరిజం ఆన్‌లైన్‌ ట్రేడ్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ను ప్రారంభించారు. అనంతరం పర్యాటకశాఖపై సమీక్ష నిర్వహించారు. పాలసీలో మార్పులు చేర్పులపై అధికారులకు సీఎం జగన్ సూచనలు ఇచ్చారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు తగిన స్థానం కల్పించాలన్నారు. రాజస్థాన్‌తో ధీటుగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలని పేర్కొన్నారు. ఆతిథ్య రంగంలో సుప్రసిద్ధ కంపెనీల భాగస్వామ్యం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 12 నుంచి 14 పర్యాటక ప్రాంతాల అభివృద్ది చేయాలని తెలిపారు. అరకులో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

''హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో మంచి కాలేజీ పెట్టాలి. ఈ కాలేజీ నుంచి బయటకు వస్తే తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందనే విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఏపీటీడీసీ ప్రాపర్టీస్,లోన్స్‌ విషయంలో ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం కావొద్దు. సగం పూరైన ప్రాజెక్ట్‌లు ముందు పూర్తి చేయాలని'' సీఎం జగన్ ఆదేశించారు.

సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారు: అవంతి శ్రీనివాస్‌

సమీక్షా సమావేశం అనంతరం పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ 12 ప్రాంతాల్లో 7 స్టార్ హోటల్స్, ఇంటర్నేషనల్ స్థాయి హోటల్స్ త్వరలోనే రానున్నాయని పేర్కొన్నారు.''రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ ఓపెన్ చేస్తాం. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక కృషి చేసున్నాం. కోవిడ్ వల్ల హోటల్స్, రిసార్ట్స్ నష్టపోయాయి. వారందరూ రాయితీల కోసం వినతి పత్రాలు ఇచ్చారు. దీనిపై సీఎం వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు. విజయవాడ బాపు మ్యూజియం త్వరలోనే ప్రారంభిస్తాం. శిల్పారామాలను కూడా పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేస్తాం.‌ సెప్టెంబర్‌ నుంచి టూరిస్టులను అనుమతించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని'' మంత్రి తెలిపారు.  

Tags:    

Similar News