తిరుమల గగనతలంపైకి విమానాలు రావొద్దని కేంద్రానికి టీటీడీ ఎందుకు లేఖ రాసింది?
తిరుమల కొండపైకి విమానాలు రావొద్దని టీటీడీ కేంద్రానికి ఎందుకు లేఖ రాసింది?
All about demand for No-fly zone over Tirumala temple: తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్న తిరుమల గగనతలంపైకి విమానాలు రాకుండా చూడాల్సిందిగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. తిరుమల తిరుపతిని నో ఫ్లై జోన్‌గా ప్రకటించాల్సిందిగా ఆయన పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడును ఈ లేఖ ద్వారా కోరారు. ఆగమ శాస్త్రం సూత్రాలను, దేవాలయం పవిత్ర వాతావరణం, భక్తుల భద్రత, మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తమ కోరికను పరిగణించాల్సిందిగా ఆయన కేంద్రమంత్రిని విజ్ఞప్తిచేశారు.
ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పవిత్రత కాపాడటం అనేది అన్నింటికంటే ఎక్కువ ముఖ్యమైన అంశం. ఆలయం సమీపంలో తక్కువ ఎత్తులో వచ్చీపోయే విమానాలు, హెలీక్యాప్టర్ల శబ్ధాలు ఆలయంలోని ఆధాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇది ఆలయాన్ని సందర్శించే భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీస్తోంది. అంతేకాదు... భక్తుల భద్రతను, ఆలయ భద్రతను కూడా ప్రశ్నార్థకంలో పడేస్తోంది. అందుకే తిరుమలను నో ఫ్ల్లై జోన్‌గా ప్రకటించండి. ఇది టీటీడీ చెబుతున్న వెర్షన్.
వాస్తవానికి ఫిబ్రవరి 17నే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు టీటీడీ చైర్మన్ ఈ లేఖను రాశారు. కానీ తాజాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తరువాతే ఆ లేఖ విషయం బయటికొచ్చింది.
గతంలోనే నో చెప్పిన కేంద్రం
కేంద్రానికి ఇలా రిక్వెస్ట్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. 2016 లో ఏపీ సర్కారు కూడా కేంద్రానికి ఇదే విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖ రాసింది. అయితే, తిరుమల గగనతలంపై ఎలాంటి ఆంక్షలు విధించినా... అవి తిరుపతి ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలకు అడ్డంకిగా మారుతాయని చెబుతూ కేంద్రం ఆ విజ్ఞప్తికి నో చెప్పింది.
ఇదే విషయమై పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా స్పందించారు. ఇప్పటికే తిరుపతిలో ఒక్క రన్ వే ద్వారా మాత్రమే విమానాలు రాకపోకలు సాగించడం ఇబ్బంది అవుతోంది. ఒకవేళ తిరుపతిని నో ఫ్లై జోన్‌గా ప్రకటిస్తే... తిరుపతి విమానాశ్రయంలో రోజువారీ కార్యకలాపాలు కొనసాగించడంలో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని జయంత్ సిన్హా అన్నారు.
పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఏమంటున్నారు?
టీటీడీ చేసిన ఈ విజ్ఞప్తిపై సంబంధిత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా స్పందించారు. వరంగల్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆ వివరాలను పంచుకునేందుకు ఆదివారం ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ లేఖ గురించి మీడియా ప్రశ్నించగా ఆయన వివరణ ఇచ్చారు.
#WATCH | Hyderabad, Telangana | On TTD Chairman BR Naidu's letter to him, Minister of Civil Aviation Ram Mohan Naidu Kinjarapu says, "... We are trying to talk with the Navigation and Air Traffic Control so that flights can take some alternate paths... There have been a lot of… https://t.co/lxn5bYrCem pic.twitter.com/SySWib80AR
— ANI (@ANI) March 2, 2025
"దేశంలో ఇప్పటికే చాలా మతపరమైన పుణ్యక్షేత్రాల నుండి ఇలాంటి వినతులు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకైతే వేటికి నో ఫ్లై జోన్ ఇవ్వలేదు. తిరుపతికి కూడా నో ఫ్లై జోన్ ఇవ్వడం కుదరదు. కాకపోతే తిరుపతి గగనతలంపైకి విమానాలు రాకుండా తిరుపతి విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నావిగేషన్ విభాగాలతో చర్చించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేలా చర్యలు తీసుకుంటాం" అని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Also watch this interesting video - Countries with More Women Than Men: ఈ దేశాల్లో మగాళ్ళ కన్నా ఆడవాళ్ళే ఎక్కువ
Also watch this Trending Story video - Posani,Vallabhaneni Arrest: వల్లభనేని వంశీ, పోసాని అరెస్ట్… రేపెవరు?
Also watch this video - Pune Bus Horror Case: 75 గంటల సెర్చ్ ఆపరేషన్... ఒక చిన్న క్లూతో దొరికిపోయిన గాడె