బాలయ్య అమరావతి పర్యటన వాయిదాకు కారణమేంటి.. ఆ రెండూ కలిసొచ్చిన రోజే వెళ్లాలని డిసైడయ్యారా?

Update: 2020-01-18 06:53 GMT
నందమూరి బాలయ్య

అమమరావతిలో రైతులకు మద్దతుగా నందమూరి బాలయ్య వస్తారని, తొడగొట్టి, మీసం మెలేసి దుమ్ముదులుపుతారని, అందరూ కళ్లుకాయలు కాసేలా ఎదురుచూశారు. కానీ ఆయన అందర్నీ నిరాశపరిచారాయన. కనుమ రోజే అమరావతికి వస్తారనుకుంటే, సడెన్‌గా వాయిదా వేసుకున్నారట. బాలయ్య అమరావతి రాకపోవడానికి కారణమేంటి? దీనిపై ఆసక్తికరమైన చాలా విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఏంటవి?

అమరావతిలోనూ బాలయ్య ఇలాంటి స్టెప్పే వేస్తాడు, రాజధాని ఆందోళన దద్దరిల్లేలా చేస్తాడని, రాజధాని రైతులందరూ ఎదురుచూశారు. కానీ బాలయ్య మాత్రం స్టెప్‌ ఇన్ కాలేదు. నెలరోజులుగా ఉద్యమాన్ని హోరెత్తిస్తున్న రాజధాని రైతులు, బాలయ్య వస్తే, ఉద్యమానికి మరింత ఊపు వస్తుందని ఆశించారు. ఇప్పటికే నారా భువనేశ్వరి, బ్రహ్మణి సైతం పండగరోజు కూడా రైతుల దగ్గరకు వచ్చి మద్దతు పలికారు. కానీ బాలయ్య రాలేదు. ఆయనెందుకు రాలేదన్నదానిపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వస్తాడని అంతా అనుకున్నారు. టీడీపీ కూడా ఆ మేరకు ప్రకటన కూడా చేసింది. కానీ చివరికి ఆయన రానేలేదు. మరి ఆయన ఎందుకు రాలేదన్నదానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. బాలయ్య వస్తే మరింత మంది సినీ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తుందని, దానివల్ల ఉద్యమం మరింత బలపడుతుందని అనుకున్నారు రైతులు. కానీ చివరి నిమిషంలో ఆయన రాకపోయేసరికి నిరాశకు లోనయ్యారు. ఉన్నపళంగా బాలయ్య తన అమరావతి పర్యటనను ఎందుకు వాయిదా వేసుకున్నారన్నదానిపై చాలా అంశాలు ప్రచారంలో వున్నాయి. రాజకీయ కారణాలా? లేక వ్యక్తిగత కారణాలా? లేక సినిమా షూటింగ్స్ వల్ల రాలేకపోయారా? అన్న అంశాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

బాలయ్య టూర్‌ వాయిదాకు ఒక కారణం, మారుతున్న రాజకీయ పరిణామాలేనన్న మాటలు వినపడ్తున్నాయి. జనసేన-బీజేపీ పొత్తు సమావేశం, ప్రెస్‌మీటే కారణమని కొందరంటున్నారు. ఈ హడావుడిలో అడుగుపెడితే, తన పర్యటనకు మీడియాలో పెద్దగా కవరేజి వుండదని భావించి, టూర్ వాయిదా వేసుకున్నారన్నారట. అయితే, ముహూర్తాలు, జాతకాలను నమ్మే బాలయ్య, అదే కారణంతోనే అమరావతిలో పర్యటన పోస్ట్‌పోన్ చేసుకున్నారన్న మాటలకు కొదువలేదు. ఈనెల 16 ఆయనకు నక్షత్ర బలం, ముహూర్త బలం లేనందునే అమరావతిలో పర్యటించలేదని కూడా చర్చ జరుగుతోంది.

అంతేకాదు, మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ, అమరావతిలో పర్యటిస్తే, మిగతా రెండు ప్రాంతాల్లో తన పట్ల వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదముందని కూడా బాలయ్య ఆలోచిస్తున్నారట. విశాఖకు రాజధాని వద్దంటే ఉత్తరాంధ్రలో, కర్నూలుకు జ్యూడిషియరీ క్యాపిటల్ వద్దంటే సీమ జనం కోప్పడతారని వెనకాముందు ఆలోచిస్తున్నారట. సినిమా హీరోగా, హిందూపురం ఎమ్మెల్యేగా తనకు సీమలో మంచి ఫాలయింగ్, పట్టు వుందని ఆలోచిస్తున్న బాలకృష్ణ, క్యాపిటల్‌ వ్యవహారంలో తలదూర్చకపోవడమే మంచిదని మిన్నకుండిపోవాలని అనుకుంటున్నారట. మొత్తానికి జనంలో క్రేజీ హీరో, టీడీపీలో కీలక లీడర్‌ వున్న బాలయ్యకు, రాజధాని వ్యవహారం తలనొప్పిలా మారిందన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి అమరావతి పర్యటన వాయిదా వేసుకున్న బాలయ్య, ఎలాగైనా పర్యటించక తప్పదని డిసైడయ్యారు. చూడాలి, అమరావతిని మార్చడానికి వీల్లేదని సమరసింహారెడ్డి లెవల్‌లో తొడగొట్టి చెబుతారో, లేదంటే సీమ, ఉత్తరాంధ్రలోనూ తనకు ఇబ్బంది కలగకుండా కేర్‌ఫుల్‌గా డైలాగ్స్‌ పేలుస్తారో.


Full View

 

Tags:    

Similar News