TDP: పశ్చిమ గోదావరి టిడిపి పీఠం ఎవరికి..?
పశ్చిమ గోదావరి జిల్లా, టీడీపీ, ఏపీఐఐసీ చైర్మన్ రామరాజు VS భీమవరం మాజీ ఏఎమ్‌సీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరావు
TDP: పశ్చిమ గోదావరి టిడిపి పీఠం ఎవరికి..?
పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కనుంది..? ఈ పదవికి పోటీ ఒకింత ఎక్కువగానే ఉందట. అయితే ప్రస్తుత అధ్యక్షుడు మళ్లీ నేను సైతం పోటీలో ఉన్నానంటున్నారట. పార్టీకి ఆది నుంచీ పట్టున్న ఈ జిల్లాలో తెలుగు తమ్ముళ్లను సమన్వయం చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయగల సమర్ధుడి కోసం హైకమాడ్ ఫోకస్ పెట్టిందట. సత్తా గల నాయకుడి పేరు సూచించేందుకు అధిష్టానం ఈపాటికే ఓ కమిటీ వేసింది. ఈ క్రమంలో తెలుగు తమ్ముళ్లు ఆతృతగా ఎదురుచూస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష పీఠంపై ఎవరు కూర్చోనున్నారు..?
టీడీపీకి ఆది నుంచీ కంచుకోటగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా హైకమాండ్ అడుగులు వేస్తోంది. అందులోభాగంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే నాయకుడ్ని అధ్యక్ష పీఠంపై కూర్చోపెట్టేందుకు అధిష్టానం పావులు కదుపుతోంది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచినప్పటికీ పశ్చిమగోదావరి జిల్లా ఉండి, పాలకొల్లు నియోజకవర్గాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. అటువంటి పశ్చిమగోదావరి జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి.. గెలుపు బావుటా ఎగురవేసే సత్తాగల నాయకుడికి జిల్లా అధ్యక్ష పీఠం అప్పగించాలని టీడీపీ హైకమాండ్ చూస్తోందట. ఈ క్రమంలో ఐవిఆర్ఎస్ ద్వారా జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తోంది. మరోవైపు ఇప్పటికే జిల్లా అధ్యక్ష పదవిపై వేసిన త్రిసభ్య కమిటీ తన నివేదిక అధిష్టానానికి ఇచ్చింది.
అయితే పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిపై ఆశావహుల జాబితా భారీగానే ఉందట. జిల్లా అధ్యక్ష పదవిని ఆశించినవారు ఈపాటికే అధిష్టానానికి దరఖాస్తులు పెట్టుకున్నారట. ఇలాఉంటే జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఇద్దరు సీనియర్ నేతల పేర్లు మాత్రమే బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరు ఏపీఐఐసీ చైర్మన్ రామరాజు కాగా.. మరొకరు భీమవరం మాజీ ఏఎమ్‌సీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరావు. జిల్లాలో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఉండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రామరాజు ప్రస్తుతం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఏపీలోకూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రామరాజుకు ఏపీఐఐసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అయినా ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పదవి తనకే కావాలని ఆయన పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారట. మరి టీడీపీ అధిష్టానం రెండు పదవులు రామరాజుకు ఇస్తుందా లేక జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వకుండా ఏపీఐఐసీ చైర్మన్ పదవితో సరిపెడుతుందా అనేది సందేహంగా ఉంది. అయితే నామినేటెడ్ పదవి అనుభవిస్తున్న రామరాజుకు జిల్లా అధ్యక్ష పదవి ఎందుకని జిల్లా టిడిపిలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి అనుగుణంగానే పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కొత్తవారికి ఇవ్వాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు పశ్చిమ గోదావరి టీడీపీ అధ్యక్ష పదవి రేసులో భీమవరం ఏఎమ్‌సీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరావు పేరు వినిపిస్తోంది. కోళ్ల నాగేశ్వరావు పార్టీ కష్టకాలంలోని టీడీపీ కోసం పనిచేసారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాగేశ్వరావుకు టిడిపి పగ్గాలు అప్పగిస్తే పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అధినేత చంద్రబాబు లెక్కలు వేస్తున్నారట. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలోని టిడిపి అధ్యక్షులు రామరాజును పక్కనపెడితే రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరావు అధ్యక్ష పదవి రేసులో ముందంజలో ఉన్నారు. విద్యార్థి దశ నుంచి ప్రజా సమస్యలపై పూర్తి అవగాహనతో పోరాటాలు చేసిన కోళ్ల.. టీడీపీ ఆవిర్బవంలోనే పార్టీలో చేరారు. 40ఏళ్లకు పైగా పార్టీలో పనిచేస్తూ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక పదవులను చేపట్టారు కోళ్ల. 2016 నుంచి 2019 వరకు భీమవరం ఏఎమ్‌సీ చైర్మన్‌గా పనిచేసారు. గడిచిన ఎన్నికల్లో పోలవరం, చింతలపూడి నియోజకవర్గాలలో ఎన్నికల పరిశీలకులుగా పనిచేసి తర్వాత కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పనిచేశారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ ఎన్నికల సమయంలో సుమారు 50 నియోజకవర్గాలకు పరిశీలకులుగా పనిచేసిన అనుభవం నాగేశ్వరరావు సొంతం. పార్టీలో చురుకుగా ఉంటూ రాజకీయాల్లోనూ అపార అనుభవం ఉన్న నాగేశ్వరరావు పశ్చిమగోదావరి జిల్లా టిడిపి అధ్యక్ష పదవి ఆశిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
జిల్లా అధ్యక్ష పదవి కోసం అధిష్టానం నియమించిన త్రిసభ్య కమిటీ అధ్యక్ష జాబితా పేర్లలో కోళ్ల నాగేశ్వరరావు పేరును ముందువరుసలో ఉంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారని కొంతమంది చెబుతున్నప్పటికీ ఆయన పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడానికి సుముఖంగా లేరన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు మంత్రిగా చేసిన అనుభవం ఉంది. అయితే ఆయన జిల్లా అధ్యక్ష పదవి చేపట్టడానికి ముందుకు రావడం లేదట. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి రేసులో పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారు, పార్టీ కోసం త్యాగాలు చేసినవారి పేర్లతో అధిష్టానం జాబితా సిద్ధం చేస్తోందట. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందోనన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది.