హంద్రీ నీవా , గాలేరు నగరి అనుసంధాన పథకం ద్వారా చిత్తూరు జిల్లాకు అవసరమైన మేరకు నీటిని తీసుకురావాలని రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. చిత్తూరు, కడప జిల్లాలోని కరువు ప్రాంతాలకు తాగు, సాగునీరు సరఫరా చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 24 న కడప జిల్లా పర్యటన సందర్భంగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారని సమాచారం. డబ్ల్యుఆర్డి అధికారుల ప్రకారం, కడప జిల్లాలోని గండికోట హెడ్ రెగ్యులేటర్ నుండి ఈ కొత్త ప్రాజెక్ట్ లో భాగంగా పైప్లైన్ ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి కడప జిల్లాలోని చక్రాయపేట మండలానికి చెందిన కలివేటి వాగులోకి కృష్ణా నీటిని పంపిస్తారు, అక్కడి నుంచి 35 కిలోమీటర్ల దూరం పైప్‌లైన్ ద్వారా నీరు తీసుకెళ్తారు.
గాలేరు-నగరి సుజల శ్రావంతి (జిఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే కడప జిల్లాలోని గండికోట నుండి చిత్తూరు జిల్లా హంద్రీ-నీవా సుజల శ్రావంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) పరిధిలోకి వచ్చే ఆదిపల్లి జలాశయం వరకు, నంబువానిపులం కుంట ద్వారా 3 టిఎంసిల నీటిని లిఫ్ట్ చేయాలనీ ప్రణాళిక రచించారు. రూ .2,000 కోట్ల వ్యయంతో 8 టిఎంసిల నీటిని పంప్ చేయడానికి అధికారులు ప్రణాళిక తయారు చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందుల, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి నియోజకవర్గం రాయచోటికి ఈ ప్రాజెక్టు ద్వారా నీరు లభించనుంది.
ఈ కొత్త ప్రాజెక్ట్ ద్వారా, చిత్తూరు జిల్లాలోని తంబల్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలకు నీరు అందనుంది. ప్రస్తుతం, 30 లిఫ్ట్ లను ఉపయోగించి 412 కిలోమీటర్ల పొడవు గల హెచ్‌ఎన్‌ఎస్ఎస్ కాలువ ద్వారా కర్నూల్ జిల్లాలోని మాల్యాల నుండి చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలను తరలిస్తున్నారు. అయితే హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, జిఎన్‌ఎస్‌ఎస్ అనుసంధాన పథకం వల్ల ద్వారా నీరు ప్రవహించే దూరం 135 కి.మీ తగ్గనుంది.