ఏపీలో కాకరేపుతున్న వ్యూహం.. ఆర్జీవీ, నారా లోకేష్ మధ్య వార్
RGV-Nara Lokesh: ఈ వార్‌లో పైచేయి ఎవరిది.. భంగపాటు ఎవరికి.?
ఏపీలో కాకరేపుతున్న వ్యూహం.. ఆర్జీవీ, నారా లోకేష్ మధ్య వార్
RGV-Nara Lokesh: దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కొంచెం తిక్కుంది. కానీ ఆ తిక్కకు లేక్క ఉందో లేదో మాత్రం ఎవరికీ తెలియదు. తనకు రాజకీయాలు తెలియవు అంటూనే.. నిత్యం ఏదో ఒక పొలిటికల్ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూనే ఉంటారు. పేరుకు పొలిటికల్ లీడర్ కాకపోయినా రాజకీయాలు మొత్తం తన చుట్టూ తిరిగేలా చేస్తుంటారు. వివాదాస్పద సినిమాలు, ట్వీట్లతో వార్తల్లో నిలుస్తుంటారు. వర్మ ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారో ఎందుకు చేస్తారో ఎవరికీ తెలియదు.
వివాదాస్పదాలకు కేరాఫ్ గా మారిన వర్మ మరోసారి ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్నారు. వ్యూహం సినిమాతో అలజడి రేపుతున్నారు. వ్యూహం కేంద్రంగా ఆర్జీవీ, నారా లోకేష్ మధ్య వార్ నడుస్తోంది. ఈ సినిమా తమను కించపరిచేలా ఉందని లోకేష్ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేయడం.. బోర్టు ఆ సినిమాను రివైజ్ కమిటీకి పంపండం హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకు వర్మ వ్యూహం ఫలిస్తుందా..? లోకేష్ శపథం నెగ్గుతుందా..? ఈ వార్‌లో పైచేయి ఎవరిది.. భంగపాటు ఎవరికి.?
టైటిల్ అనౌన్స్ నాటి నుంచే ఏపీలో కాకరేపింది వ్యూహం సినిమా. వైసీపీకి పాజిటివ్‌గా, టీడీపీకి వ్యతిరేకంగా ఉండబోతోందని పొలిటికల్ సర్కిల్‌లో చర్చ మొదలైంది. జగన్‌ను హీరోలా, చంద్రబాబును విలన్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని వర్మపై తెగ ఫైర్ అయ్యారు తమ్ముళ్లు. అగ్నికి ఆజ్యం పోసినట్టు వ్యూహం పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్‌తో ఇంకాస్త హీట్ పెంచాయి. వైఎస్సార్ మరణం, కాంగ్రెస్‌తో విభేదాలు, జగన్ పాదయాత్ర, జైలుకు వెళ్లడం, వ్యూహాలు ప్రతివ్యూహాల నడుమ 2019ఎన్నికల్లో వైసీపీ గెలుపు, స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టును ఇందులో చూపించబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. దీంతో వ్యూహం సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ శ్రేణులు.
నవంబర్ 10న రిలీజ్ కావాల్సిన వ్యూహం మొదటి భాగాన్ని అడ్డుకోవాలని సెన్సార్ బోర్డుకు నారా లోకేష్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఆరు పేజీల లేఖలో లోకేష్ పలు అంశాల్ని ప్రస్తావించారు. ఓటర్లను ప్రభావితం చేసే లక్ష్యంతో వ్యూహం చిత్రాన్ని తీస్తున్నారని, ఇందులో తన తండ్రి చంద్రబాబుతో పాటు తననూ కించపరిచేలా పలు సన్నివేశాలు ఉన్నాయని, ఇవి పరువునష్టం దావా కిందకు వస్తాయని తెలిపారు. చంద్రబాబును ప్రతిష్టను దిగజార్చేలా ఈ సినిమా ఉందన్నారు. 11 సీబీఐ కేసులు, 7 ఈడీ కేసులున్న జగన్ ను గొప్ప వ్యక్తిగా ఈ సినిమాలో చూపారని లోకేష్ ఆరోపించారు.
అలాగే స్కిల్ కేసులో తన తండ్రిపై సీఐడీ చేసిన ఆరోపణలన్ని నిజాలన్నట్లుగా ఈ సినిమాలో చూపారని, ముడుపులు తీసుకున్నట్లు చెప్పారని తెలిపారు. కాబట్టి ఈ చిత్రం సదరు స్కిల్ కేసు విచారణను కూడా ప్రభావితం చేస్తుందన్నారు. కాబట్టి సెన్సార్ బోర్డు నిబంధనల ప్రకారం ఈ చిత్రానికి అనుమతి నిరాకరించాల్సిందిగా లోకేష్ కోరారు.
లోకేష్ ఫిర్యాదుతో..వ్యూహం సినిమాకు సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించింది సెన్సార్ బోర్డ్. దీంతో నవంబర్ 10న రిలీజ్ కావాల్సిన వ్యూహాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు ఆర్జీవీ. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్, అమరాజ్యంలో కడప బిడ్డలు లాంటి చిత్రాలు చేశాను. ఎలాంటి అడ్డంకులు రాలేదు. బాలీవుడ్ లో యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ చిత్రం వచ్చింది.. ఎవరైనా అడ్డుకోగలిగారా అని వర్మ ప్రశ్నించారు. సెన్సార్ బోర్డు అనేది అవుట్ డేటెడ్ సిస్టం అంటూ వర్మ తీవ్ర విమర్శలు చేశారు.
సినిమాని అడ్డుకునే పవర్ సెన్సార్ కి లేదని కోర్టులే చెబుతున్నాయన్నారు. వ్యక్తులపై, సమస్యలపై ఎవరైనా అభిప్రాయం చెప్పవచ్చు అని వర్మ అన్నారు. రివైజింగ్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దానినిబట్టి తమ నెక్స్ట్ స్టెప్ ఉంటుందని వర్మ అన్నారు.
వ్యూహం సినిమా కేంద్రంగా.. ఆర్జీవీ, లోకేష్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాంగోపాల్ వర్మ తెలుగు రాష్ట్రానికి ఏం చేశాడని, రాష్ట్ర అభివృద్ధిలో ఆయన పాత్ర ఏమిటీ? అంటూ అడిగారు. దీనికి ఆర్జీవీ కౌంటర్ ఇస్తూ.. లోకేశ్‌లా తాను సమాజ సేవ చేస్తానని ప్రకటించలేదని, తాను సినిమా డైరెక్టర్‌నని, సినిమాలు తీయడమే తన పని అని వివరించారు. తనను ఎలా విమర్శించాలో కూడా నారా లోకేశ్‌కు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. అనైతిక మనిషి, బాధ్యతలేని మనిషి, సినిమాలు హిట్ కాక నిస్పృహలో ఏది పడితే అది సినిమాగా తీస్తున్నాడని కూడా తనను విమర్శించవచ్చునని, అవసరమైతే అలాంటి వ్యక్తికి తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరమే లేదని కూడా దాటవేయవచ్చునని చెప్పారు.
అంతేకానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తన కాంట్రిబ్యూషన్ ఏమిటని ప్రశ్నించడం విడ్డూరంగా ఉన్నదని వర్మ అన్నారు. నారా లోకేశ్‌ను బేబీ అని సంబోధిస్తూ ఈ మాత్రం కూడా సబ్జెక్ట్ మ్యాటర్ తెలియకుంటే ఎలా? అంటూ చురకలు అంటించారు. తన లాంటి వారినీ సరిగ్గా విమర్శించడం చేతగాక పోతే ఆయన తండ్రిని ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ కామెంట్ చేశారు వర్మ.
ఆర్జీవీ, లోకేష్ మధ్య ట్విట్టర్ వార్‌తో పంచాయితీ ముదిరింది. టీడీపీ సపోర్ట్స్..ఆర్జీవీని, వైసీపీని విమర్శిస్తే.. వర్మ అభిమానులు, వైసీపీ శ్రేణులు తెలుగుదేశంపై సెటైర్లు వేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఏదేమైనా గత ఐదారు ఏండ్లుగా టీడీపీ పాలిట శత్రువుగా మారారు ఆర్జీవీ. గత ఏడాది ఎన్నికల ముందు.. చంద్రబాబును ఇరుకున పెట్టేలా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీశారు.
ఆ తర్వాత అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అంటూ మరో సినిమా తీశారు. తాజాగా వ్యూహం, శపథంలోనూ ఆర్జీవీ చంద్రబాబునే టార్గెట్ చేసినట్టుగా టీజర్, ట్రైలర్‌ను బట్టి చూస్తే అనిపిస్తోంది. ఇంతకు చంద్రబాబు అంటే వర్మకు ఎందుకంత కోపం. ఎందుకు వరుసగా బాబును ఆర్జీవీ టార్గెట్ చేస్తున్నారు.