దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతున్న విశాఖ

*GVMC పరిధిలో రూ.1000 కోట్లతో 50 ప్రాజెక్టులకు అనుమతి

Update: 2022-05-14 02:00 GMT

దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతున్న విశాఖ

Visakhapatnam: అందాల మహా విశాఖ అన్నింటా అగ్రగామిగా నిలిచేందుకు దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతోంది. అటు స్వచ్ఛతలో దూసుకుపోతున్న వైజాగ్, ఇప్పుడు స్మార్ట్ అవార్డుల రేసులోనూ అడుగు ముందుకేసింది. గతంలో రెండు సార్లు స్మార్ట్ సిటీస్ అవార్డులను తన ఖాతాలో వేసుకున్న సాగరనగరం, ఇప్పుడు మరో అవార్డు సాధించేందుకు సన్నద్ధమవుతోంది.

నగరాల్లో నివసించే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ఆర్థిక వృద్ధిని పెంపొందించడం, భద్రత, డిజిటల్ వ్యవస్థల ఏర్పాటు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ మిషన్ ను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ నగరాలను ఎంపిక చేసిన కేంద్రం.. రెండో జాబితాలో విశాఖ సిటీని ప్రకటించింది. 2016లో ప్రాజెక్టులకు సంబంధించిన DPRలు, టెండర్ల తయారీకే సమయం సరిపోవడంతో ఎక్కడా ఒక్క ప్రాజెక్టు అడుగు ముందుకు పడలేదు. ఆ తర్వాత నుంచి GVMC క్రమంగా దూసుకుపోతోంది. GVMC ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో ఏపీ స్మార్ట్ సిటీ మిషన్ కూడా కొనసాగుతోంది.

స్మార్ట్ సిటీలో భాగంగా GVMC పరిధిలో 1000 కోట్లతో 50 ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో ఇప్పటికే రూ.296 కోట్ల విలువైన 29 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 409 కోట్ల విలువైన 19 ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. మరో రెండు ప్రాజెక్టులు టెండరు దశలో ఉన్నాయి. కేవలం ఒకే రంగంలో అభివృద్ధి అనే గిరి గీయకుండా, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆహ్లాదం, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జీవీఎంసీ కొత్త ఆలోచనలతో ముందుకెళ్లింది. రెండేళ్లుగా స్మార్ట్ సిటీ మిషన్ అందిస్తున్న స్మార్ట్ ఇన్నోవేషన్ అవార్డుల్లో జీవీఎంసీ ఏటా అవార్డును కైవసం చేసుకుంటుంది. విశాఖలో నిర్వహిస్తున్న ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు GVMC అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News