Viral Fevers: గుంటూరు జిల్లాను వణికిస్తున్న విషజ్వరాలు

Viral Fevers: వారంలో ముగ్గురు చిన్నారులు మృతి * వారం నుంచి రోజూ 30 కేసులు

Update: 2021-10-17 14:16 GMT
గుంటూరు జిల్లాలో విషజ్వరాల భయం (ఫైల్ ఇమేజ్)

Viral Fevers: గుంటూరు జిల్లాను విషజ్వరాలు వణికిస్తున్నాయి. వేలాదిమంది ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. స్థోమత ఉన్నవారు ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తుండగా పేదలు సర్కారు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు సరిపడా బెడ్లు లేవు. ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవడం.. పారిశుధ్య నిర్వహణలో లోపాలు జ్వరాల పెరుగుదలకు కారణమనే విమర్శలు వస్తున్నాయి.

గుంటూరు జిల్లా ప్రజలు జ్వరాలతో అల్లాడుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో డెంగ్యూ విజృంభిస్తోంది. ఏటా కంటే ఈ ఏడాది ఆరు రెట్లు ఎక్కువ కేసులు ఇక్కడ నమోదవుతున్నాయి. మొదటి నెలరోజులు పెద్దలపై ప్రభావం చూపించగా.. 15 రోజుల నుంచి చిన్నారులపై పంజా విసురుతోంది. వినుకొండ ప్రాంతంలో వారం వ్యవధిలో ముగ్గురు చిన్నారులు మృతి చెందడం కలకలం రేపుతోంది. ప్రతి డెంగ్యూ సీజన్‌లోనూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు నాలుగైదు కేసులు నమోదవుతాయి. గతం వారం నుంచి రోజూ 30 డెంగ్యూ లక్షణాల కేసులు వస్తున్నాయి. వీరిలో నలుగురైదుగురు ఐసీయూకి వెళ్లే పరిస్థితి ఉంది.

డెంగీ పెద్దఎత్తున ప్రబలేందుకు వాతావరణంలో మార్పులే కారణమని భారత వైద్య పరిశోధన మండలి శాస్త్రవేత్తలు ప్రకటించారు. జూన్‌ మాసంలో ప్రారంభమైన వర్షాలు.. సెప్టెంబర్‌ మాసాంతం వరకు అడపా దడపా కురుస్తూనే ఉన్నాయి. దీంతో వర్షం నీరు పలు చోట్ల నిలిచి డెంగీకి కారణమయ్యే దోమల సంతతి వృద్ధి చెందేందుకు కారణమైనట్లు ఐసీఎంఆర్‌ ప్రకటించింది. డెంగీ వైరస్‌లో నాలుగు రకాలు ఉండగా, ప్రస్తుతం జిల్లాలో ప్రమాదకరమైన డెంగీ-2 స్ట్రెయిన్‌ వైరస్‌ వ్యాపిస్తోంది. డెంగీ-2 వైరస్‌తో హెమరేజిక్‌ ఫీవర్‌ బారిన పడే ప్రమాదం అధికంగా ఉంటుందని వైద్యవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ దశలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గి శరీరంలో రక్తస్రావం జరిగే అవకాశాలు ఉంటాయి. డెంగ్యూ జ్వరం వచ్చిందంటే ప్రజలు హడలిపోతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకు వెళితే వేలకు వేలు ఖర్చవుతున్నాయి. అలాగని ప్రభుత్వాస్పత్రికి తీసుకు వస్తే బెడ్లు లేవు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక్కో బెడ్డుపై ఇద్దరు రోగులను పడుకోబెడుతున్నారు. దీంతో సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

గ్రామాల్లో పారిశుధ్యం అంతంతమాత్రంగా ఉండటంతో దోమల వ్యాప్తి అధికమై ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నాయి. వినుకొండ పట్టణంలోని మసీదు మాన్యంలో ఇటీవల ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దీనికి ప్రధాన కారణం ఇక్కడి పారిశుధ్య లోపమేనని ఆరోపిస్తున్నారు. అయినా ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వాసుపత్రులలో డెంగ్యూ చికిత్సకోసం ప్రత్యేక బెడ్‌లను ఏర్పాటు చేయకపోగా.. పారిశుధ్యాన్ని మెరుగు పరిచే ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. నీటి కాలుష్యం కూడా ఇందుకు తోడవుతోంది. డెంగ్యూ మరణాలకు అశ్రద్ధ కూడా కారణమవుతోంది. జ్వరం వచ్చిన రోజునే కరోనా పరీక్ష, ప్లేట్లెట్ల పరీక్ష చేయించుకుని అప్రమత్తంగా ఉండాలి. కడుపునొప్పి, వాంతులను అశ్రద్ధ చేయవద్దు. చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.

పారిశుద్ధ్య లోపమే విష జ్వరాలు ప్రబలడానికి కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రజలు ఇంటి పరిసర ప్రాంతాల్లోని ఖాళీ కొబ్బరి బోండాలు, వాడి పడేసిన టైర్లను దూరంగా పడేయాలి. కూలర్లు, తొట్టెల్లో నీరు నిల్వ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అధికార యంత్రాంగం క్రమం తప్పకుండా ఫాగింగ్ చేపట్టి దోమలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి.

Tags:    

Similar News