వైసీపీకి భారీ షాక్‌.. వంగవీటి రాధా రాజీనామా

Update: 2019-01-20 11:45 GMT

ఎన్నికల ముందు ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. సీనియర్ నేత వంగవీటి రాధా ఆ పార్టీకి రాజీనామా చేశారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో సమావేశమై చర్చించాక ఏ పార్టీలో చేరాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వలేదన్న కారణంగా ఆయన వైసీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. 2004లో రాజకీయాల్లోకి వస్తూనే విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా విజయం సాధించారు రాధా. 2014లో వైసీపీ నుంచి విజయవాడ తూర్పులో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత సెంట్రల్ స్థానంపై దృష్టి పెట్టారు.

వైసీపీ అధిష్టానం కూడా రాధాను సెంట్రల్ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌గా నియమించింది . ఐతే.. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పార్టీలోకి రావడం, ఆయనకు సెంట్రల్ సీటు కన్ఫర్మ్ చెయ్యడంతో జగన్‌తో విభేదించారు రాధా. అయితే మచిలీపట్టణం ఎంపీ టికెట్, విజయవాడ తూర్పు టికెట్ లో ఏది కావాలన్నా ఇస్తానని రాధాకు జగన్ చెప్పినా ఆయన వినలేదు. తనకు సెంట్రల్ సీటే కావాలని పట్టుబట్టారు. అయితే సెంట్రల్ సీటును బ్రాహ్మణులు కోరడంతో మల్లాది విష్ణుకు కేటాయించారు జగన్. దాంతో కలత చెందిన రాధా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాధా ఈ నెలాఖరున జనసేనలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Similar News