వంశీకి వైసీపీ నుంచే గ్రీన్ సిగ్నల్ రాలేదా?

Update: 2019-11-09 02:57 GMT

టీడీపికి, గన్నవరం శాసనసభ్యత్వానికి వల్లభనేని వంశీ మోహన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వంశీ నిర్ణయం అయితే తీసుకున్నారు కానీ ఇప్పటివరకు అమలు చేయలేదు. టీడీపీకి రాజీనామా చేసి10 రోజులకు పైగా అయినప్పటికీ భవిశ్యత్ కార్యాచరణ ఏంటనే విషయంపై ఇప్పటికి స్పష్టత లేదు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన తరువాత రాజీనామా చేసిన వంశీ వైసీపీలో చేరతారని అందరూ భావించారు. నవంబర్ 3 న ఆయన అధికార పార్టీలోకి ప్రవేశిస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఆ పని చేయలేదు.

పార్టీలో చేరడానికి వంశీ సిద్ధమైనప్పటికీ వైసీపీ గన్నవరం ఇంచార్జ్ యార్లగడ్డ వెంకటరావు నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న కారణంగానే చేరిక ఆలస్యం అవుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీలో చేరేముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని వైసీపీ కోరింది. దీనికి సిద్దమైన వంశీ రెండవ వ్యూహాన్ని కూడా అమలు చేయాలని ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.

అది ఏంటంటే.. గన్నవరం నియోజకవర్గానికి జరిగే తదుపరి ఉప ఎన్నికలలో.. వైసీపీ అభ్యర్థి యర్లగడ్డ వెంకట్ రావు తరఫున ప్రచారం చేయడం ద్వారా పార్టీ పట్ల తన విధేయతను నిరూపించుకోవాలని ఆయనకు చెప్పారని తెలుస్తోంది. ఇప్పుడిదే వ్యూహాన్ని వంశీ అమలు చేయడానికి దాదాపు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అలా చేస్తే రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ, లేదంటే రాజ్యసభ సీటు అడగవచ్చని వంశీ భావిస్తున్నారట.

మరోవైపు సుజనా చౌదరితోను రెండో దఫా చర్చలు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే వంశీకి.. వైసీపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ వంశీ బీజేపీలో చేరినా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని అమలు చేసి అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ తరుపున పోటీ చేస్తే వంశీ విజయం సాధిస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు వంశీని బుజ్జగించేందుకు టీడీపి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల చివరి ప్రయత్నంగా మరోసారి విజయవాడ ఎంపి కేసినేని నాని, మాజీ ఎంపి కోనకల్ల నారాయణరావులు వంశీ వద్దకు వెళ్లారు. అయితే తన నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదని తేల్చి చెప్పారు.

దీంతో చేసేదేమి లేక టీడీపి సైలెంట్ అయిపోయింది. ఇటు వంశీ కూడా ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయమూ ప్రకటించలేదని ఊపిరి పీల్చుకుంది. వంశీ గనక పార్టీ మారితే మాత్రం టీడీపికి భారీ ఎదురుదెబ్బే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Tags:    

Similar News