వైసీపీ ప్రభుత్వానికి నా మద్దతు తెలియజేస్తున్నా.. జగన్ తో కలిసి నడుస్తా: వల్లభనేని వంశీ

Update: 2019-11-14 12:12 GMT

ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ త్వరలోనే వైసీపీలో చేరనున్నట్టు సమాచారం. వైసీపీలో చేరడంతో ఆయన తేల్చేశారు. వైసీపీ ప్రభుత్వానికి తన మద్దతు తెలియజేస్తున్నానని, సీఎం జగన్ తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్టు గురువారం వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ తనకు చేసిన ప్రామిస్ మేరకు ఆయనతో కలిసి నడుస్తానని చెప్పారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తప్పులు జరుగుతాయని, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తప్పులు జరిగాయని అన్నారు. చాలా ఏళ్ల నుంచి జగన్ తో తనకు వ్యక్తిగతంగా అనుబంధం ఉందన్నారు.

తన నియోజకవర్గ ప్రజల కోసం, ఇళ్ల పట్టాల కోసం, తన కోరిక సఫలం అవడం కోసం జగన్మోహన్ రెడ్డిని కలిసిన మాట వాస్తవమేనని.. ప్రస్తుత ప్రభుత్వంలో కొంత మంది అధికారుల కారణంగా తప్పులు జరిగాయని, ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళితే పరిశీలిస్తానని ఆయన చెప్పారని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహితుడిని అన్న కారణంతో టీడీపీ నేతలు తనను దూరం పెట్టారని ఆరోపించారు. చినబాబు లోకేష్ అనేక వెబ్సైటు లను నడిపిస్తూ.. తనపై అసత్య కథనాలతో ఆర్టికల్స్ రాయిస్తున్నారని అన్నారు. జయంతికి వర్ధంతికి తేడా తెలియని వారు కూడా తనపై ఆర్టికల్స్ రాయిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా వైసీపీలో ఎప్పుడు చేరతారా మాత్రం వంశీ వెల్లడించలేదు. మరోవైపు తెలుగు యువత అధ్యక్ష పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన దేవినేని అవినాష్‌ గురువారం సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. దేవినేని అవినాష్‌తో పాటు టీడీపీ సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు వైఎస్సార్‌ సీపీలో చేరడం విశేషం. 

Tags:    

Similar News