సీతంపేట మన్యంలో పసుపు పంట.. కష్టపడి సాగు చేసినా.. గిరిజనులకు దక్కని గిట్టుబాటు ధర

*రెక్కలు ముక్కలు చేసుకొని పసుపు పంటను సాగుచేస్తున్న గిరిజన రైతులకు ఉట్టి చేతులే మిగులుతున్నాయి.

Update: 2022-11-22 05:01 GMT

సీతంపేట మన్యంలో పసుపు పంట.. కష్టపడి సాగు చేసినా.. గిరిజనులకు దక్కని గిట్టుబాటు ధర 

Srikakulam: రెక్కలు ముక్కలు చేసుకొని పసుపు పంటను సాగుచేస్తున్న గిరిజన రైతులకు ఉట్టి చేతులే మిగులుతున్నాయి. అటు ITDA అధికారులు పట్టించుకోకపోవడంతో.. దళారులకే అమ్ముకోవల్సిన దుస్థితి ఏర్పడిందని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా గిరిజనులు వాపోతున్నారు.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మన్య ప్రాంతమైన సీతంపేటలో పోడు వ్యవసాయం ద్వారా, అలాగే కొండ కింద ప్రాంతంలో రైతులు పసుపును పండిస్తున్నారు. పోడు వ్యవసాయం ద్వారా, మైదాన ప్రాంతంతో సుమారు వెయ్యి ఎకరాల్లో పంటను పండిస్తున్నారు. ముఖ్యంగా సీతంపేటలో పండుతున్న పసుపు పంటకు మంచి గిరాకీ ఉంది. కొండలపైకి ఎక్కి పసుపును తవ్వి కిందకు తీసుకువచ్చి మొదటి రకం, రెండో రకంగా విభజన చేస్తారు. అనంతరం వచ్చిన పసుపును కుండల్లో వేసి ఉడకబెడతారు. ఉడకబెట్టిన పసుపును ఎండలో చాపల మీద, నున్నటి రాల్ల మీద ఎండ బెడతారు. ఆ పద్దతితో కూడా గ్రేడులను డివైడ్ చేస్తారు. అనంతరం పసుపు కొమ్మలను మల్లుదొర, కుసిమి సంతల్లో గిరిజన రైతులు విక్రయించడానికి తీసుకొని వస్తారు.

సంప్రదాయ పద్దతుల్లో తయారు చేసిన పసుపును ఆయుర్వేద వైద్యులు కొనుగోలు చేస్తారు. వీటి ఉపయోగాలు తెలుసుకున్న దళారులు రైతుల నుండి తక్కువ రేటుకు కొంటున్నారు. ఇంత జరుగుతున్న ITDA అధికారులు మాత్రం దీనిపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కష్టపడి పండించిన పంట దళారుల పాలవుతోందని గిరజన రైతులు వాపోయారు.

కేవలం పసుపు పంట మాత్రమే కాకుండా మిగిలిన పంటలు కూడా.. దళారుల పాలవుతున్నాయని.. దీనిపై ITDA అధికారులు దృష్టి సారించాలని రైతు కూలి సంఘం నాయకులు కోరుతున్నారు. గిడ్డంగులు లేకపోవడం వల్లే గిరిజనులు తమ పంటను తక్కువ ధరకు అమ్ముకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా అధికారులు గిరిజన రైతులకు అండగా ఉంటారని మనమూ ఆశిద్దాం. 

Tags:    

Similar News