పండగకు గిరిజన నేస్తం..

Update: 2020-01-16 05:00 GMT
పండగకి తరలి వెలుతున్న గిరిజన కుటుంబం

సంక్రాంతి పండగ అంటే చాలు సందడిగా ఉంటుంది. ఊరంతా రంగుల ముగ్గులు, ఇళ్లంతా చుట్టాలు, పిండి వంటలు, కొత్త పంటలు, గాలిపటాల పోటీలు, కోడి పందాలు ఇవన్నీ సంక్రాంతి పండగలో భాగమే. ఈ పండగను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అక్కడ కూడా ప్రాంతాల వారిగా ఒక్కో ప్రాంత ప్రజలు ఒక్కో పద్ధతిలో పండగను చేసుకుంటారు. ఈ కోణంలోనే అక్కడి గిరిజనులు జరుపుకునే పండగ పద్ధతులు కూడా విభిన్నంగా ఉంటాయి.

ఎక్కడో కొండల్లో, గుట్టల్లో నివసించే గిరిజనులు పట్టణాల్లో ఉన్న వారి స్నేహితులతో పండగను జరుపుకుంటారు. ఈ ఒక్క పండగ మాత్రమే కాదు దీంతో పాటు దసరా, దీపావళి, ఉగాది వంటి పండగలు వచ్చినా గిరిజన సంప్రదాయం ప్రకారమే జరుపుకుంటారు. పండగలకు వారు పోడు భూముల్లో పండించే పంటలను స్నేహితులకు తీసుకెళతారు. ముఖ్యంగా గుమ్మడికాయ, అరటి కాయలు, అరటి పళ్లు, కందికాయలు, అరటి ఆకులు ఇలా ఏ పంటలు పండించినా సరే తీసుకెళ్లి ఎంతో ఆనందంగా పండగను జరుపుకుంటారు.

ఇక తమ ఇంటికి పండగకు వచ్చిన గిరిజన నేస్తానికి దిగువ ప్రాంతంలోని స్నేహితులు వివిధ రకాల వంటలతో భోజనం పెట్టి కొత్తబట్టలు, బియ్యం, పప్పులు, పిండి వంటలు పెడతారు. అంతే కాక ఎంతో దూరం నుంచి వస్తున్న వారికి దారి ఖర్చులకు ఎంతో కొంత డబ్బులను ఇచ్చి నేస్తాన్ని సంతృప్తి పరిచి పంపిస్తారు. ఈ విధంగా వారిని ఆనందింపజేసిన నేస్తాన్ని గిరిజనులు మనసుపూర్తిగా దీవించి వారి గ్రామాలకు తిరుగు ప్రయాణం చేస్తారు.




Tags:    

Similar News