Tirumala Temple: కరోనా కట్టడికి టీటీడీ చర్యలు

Tirumala Temple: సెకండ్ వేవ్ ఉద్ధృతం కావడంతో వైరస్ కట్టడికి టీటీడీ చర్యలు చేపట్టింది.

Update: 2021-04-09 07:36 GMT

తిరుమల టెంపుల్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Tirumala Temple: ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తిరుమలలో మరోసారి కోవిడ్ రూల్స్ ప్రవేశపెట్టింది టీటీడీ. మరోవైపు భక్తుల సంఖ్యను క్రమక్రమంగా తగ్గిస్తోంది. గత ఏడాది లాక్ డౌన్ కారణంగా మార్చి 20 నుంచి దాదాపు 80రోజుల పాటు తిరుమలలో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసింది టీటీడీ. ఆ తర్వాత లాక్ డౌన్ సడలింపులతో జూన్ 8 నుంచి శ్రీవారి ఆలయం దర్శనం పునఃప్రారంభించింది. గతంలో మాదిరిగా వేలాది మంది భక్తులను కాకుండా ముందుగా రోజూ 6వేల మంది భక్తులను అనుమతి ఇచ్చి తర్వాత సంఖ్య పెంచుకుంటూ వెళ్లింది. ప్రస్తుతం అన్నిరకాల టికెట్లపై 55వేల మంది భక్తులకు అనుమతిస్తోంది.

కరోనా నిబంధనలను కఠినతరం..

ప్రస్తుతం సెకండ్ వేవ్ ఉద్ధృతి నేపధ్యంలో తిరుమలలో కరోనా నిబంధనలను కఠినతరం చేసింది టీటీడీ. అన్నప్రసాద సత్రం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కళ్యాణకట్ట తదితర చోట్లను ప్రతి రెండు గంటలకోసారి శానిటైజ్ చేస్తున్నారు. పుష్కరిణిలో స్నానాలు రద్దు చేశారు. అలిపిరి నడక, రోడ్డు మార్గంలో వచ్చే భక్తులకు స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్నారు.

80 మందికి పైగా విద్యార్ధులకు పాజిటివ్ ...

టీటీడీ ఉద్యోగుల్లో కొందరికి కరోనా సోకడంతో టీటీడీ అప్రమత్తమైంది. 80 మందికి పైగా విద్యార్ధులకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో వేద పాఠశాలకు సెలవు ప్రకటించింది. టైంస్లాట్ టికెట్లను 22 వేల నుంచి 15 వేలకు తగ్గించింది. ఈనెల 12వ తేదీ నుండి టైం స్లాట్ టోకెన్లను రద్దు చేయనుంది. ఆన్ లైన్ లో విడుదల చేసే మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల సంఖ్యను కుదిస్తారా లేదా అనే అంశంపై పరిస్థితులు బట్టి నిర్ణయం తీసుకుంటామని టీటీడీ అధికారులు చెబుతున్నారు. తిరుమలలో కరోనా కట్టడికి టీటీడీ తీసుకుంటున్న చర్యలను భక్తులు స్వాగతిస్తున్నారు. మాస్కులేనిదే ఆలయం లోపలికి అనుమతించడంలేదని చెబుతున్నారు. తిరుమలలో కరోనా సెకండ్ వేవ్ కట్టడికి టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశమై జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. 

Tags:    

Similar News