7 సెకండరీ ఆస్పత్రుల్లో టిఫా స్కానింగ్ సౌకర్యం
గర్భిణిలు, శిశు సంరక్షణ చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం తొలిసారిగా రాష్ట్రంలోని 7 సెకండరీ అసుపత్రుల్లో 'టిఫా' (Targeted Imaging for Fetal Anomalies-TIFFA) స్కానింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
అమరావతి: గర్భిణిలు, శిశు సంరక్షణ చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం తొలిసారిగా రాష్ట్రంలోని 7 సెకండరీ అసుపత్రుల్లో 'టిఫా' (Targeted Imaging for Fetal Anomalies-TIFFA) స్కానింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. నర్సీపట్నం, తుని, నందిగామ ఏరియా ఆసుపత్రుల్లో, ఒంగోలులోని ఎంసీహెచ్ (మాతా, శిశు వైద్యశాల), పార్వతీపురం, తెనాలి, అనకాపల్లి జిల్లా ఆసుపత్రుల్లో టిఫా స్కానింగులను సిద్ధం చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రస్తుతం వాటి పనితీరును పరిశీలిస్తున్నామని తెలిపారు.
జనవరి 1 నుంచి స్కానింగ్ సేవలు పూర్తిస్థాయిలో గర్భిణిలకు అందుబాటులో వస్తాయని చెప్పారు. ఒక్కొక్క టిఫా స్కానింగ్ ఖరీదు రూ.30.48 లక్షల చొప్పున ఏడింటికి కలిపి రూ.2.13 కోట్ల వరకు వ్యయంచేసినట్లు మంత్రి తెలిపారు. గర్భిణిల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎంపికచేసిన ఈ 7 అసుపత్రుల్లో మూడు ఉత్తరాంధ్రలోనే ఉన్నాయి. దీనివల్ల గిరిజన మహిళలకు ఆధునిక వైద్య సేవలు మరింత అందుబాటులోనికి వచ్చినట్లయింది.
గర్భిణిలకు తప్పిన అవస్థలు- శిశువులకు పెరిగిన భరోసా
గర్భం దాల్చిన 18-22 వారాల మధ్య శిశువు మెదడు, వెన్నెముక, గుండె, కాళ్లు, కడుపు, మావి, బొడ్డుతాడు వంటి వాటిని నిశితంగా పరిశీలించేందుకు, లోపాలు ఉంటే కనుగొనేందుకు ఈ టిఫా స్కానింగ్ మిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి సత్యకుమార్ చెప్పారు. ఈ 7 టిఫా స్కాన్లవల్ల ప్రతినెలా 1,000 మంది గర్భిణిలు ప్రయోజనం పొందుతారని అంచనా. ప్రస్తుతం ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో మాత్రమే ఈ టిఫా సౌకర్యం ఉంది. దీనివల్ల దూర ప్రాంతాల గర్భిణిలు టిఫా స్కానింగ్ కోసం వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. ఈ సేవలను ప్రైవేట్ ఆసుపత్రుల్లో పొందాలంటే సదరు ప్రాంతాల డిమాండ్ అనుసరించి, రూ.3,000 నుంచి రూ.4,000 వరకు వ్యయమవుతుంది. ఈ పరిస్థితుల్లో గర్భిణిల సమస్యలు దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం సెకండరీ ఆసుపత్రుల్లోనే ఈ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. తద్వారా ఆయా ప్రాంతాల గర్భిణిలకు వ్యయప్రయాసలు తగ్గుతాయని, ఆర్ధిక భారం కూడా తగ్గుతుందని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు తెలిపారు.