నేటితో ముగియనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు

* వార్డు మెంబర్లకు 28,155 నామినేషన్లు దాఖలు * అత్యధికంగా అనంతపురంలో 988,..

Update: 2021-02-08 03:45 GMT

Representational Image

ఏపీలో ఇవాళ్టితో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు కూడా గడువు ముగియనుంది. నిన్న ఒక్కరోజే మూడో విడత సర్పంచ్‌ స్థానాలకు 7వేల 164 నామినేషన్లు, వార్డు మెంబర్లకు 28వేల 155 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా అనంతపురంలో 988, అత్యల్పంగా గుంటూరులో 197 సర్పంచ్‌ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక వార్డు స్థానాలకు వస్తే అత్యధికంగా అనంతపురంలో 3వేల 311, అత్యల్పంగా గుంటూరులో ఒక వేయి 69 నామినేషన్లు వచ్చాయి. మరోవైపు ఏకగ్రీవాలపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

మరోవైపు రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 2వేల 723 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటిగంటన్నరకే పోలింగ్‌ ముగియనుంది. అనంతరం సాయంత్రంలోపు ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

ఇక ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ పర్యటన కొనసాగుతోంది. అయితే షెడ్యూల్‌ ప్రకారం నేటి నుంచి రెండ్రోజుల పాటు సీమ జిల్లాల్లో ఎస్‌ఈసీ పర్యటించాల్సి ఉంది. చివరి నిమిషంలో కొన్ని అనివార్య కారణాలతో కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు నిమ్మగడ్డ. 

Full View


Tags:    

Similar News