టూరిజం హబ్ గా 'పోలవరం' పరిసరాలు
పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ ప్రాంతం, ఆ పరిసరాలను టూరిజం హబ్ గా రూపుదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది.
అమరావతి: పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ ప్రాంతం, ఆ పరిసరాలను టూరిజం హబ్ గా రూపుదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. పోలవరం ప్రాజెక్టులో లైడార్ సర్వే చేసి గుర్తించిన 9,900 ఎకరాల ప్రాంతాన్ని టూరిజం హబ్ గా మార్చబోతున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఇందుకు సంబంధించి లేఅవుట్ ప్లాన్ డిజైన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అమరావతి సచివాలయంలో మంగళవారం పోలవరం స్పిల్ వే బ్యూటిఫికేషన్ కు సంబంధించి, ఆర్కిటెక్ట్స్, ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి సమావేశం అయ్యారు. ఆర్కిటెక్ట్స్ రూపొందించిన లేఅవుట్ ప్లాన్ డిజైన్లను ఆయన పరిశీలించారు.
ఈ సమావేశంలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ, తెలుగుదనంతో పాటు రాష్ట్ర ఔన్నత్యం చాటేలా పోలవరం స్పిల్ వే ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పోలవరం లెఫ్ట్ బ్యాంకును కలుపుతూ వంతెనల నిర్మాణానికి సైతం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. జాతీయ రహదారులు 365 బిబి నుంచి 516ఈ ని అనుసంధానం చేయాలన్నారు. ఇందుకుగాను రోడ్డు రవాణా సౌకర్యం ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయమని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు, ఆర్కిటెక్ట్స్ పాల్గొన్నారు.