టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు నిజమవుతున్నాయా? ఆయనకు ఎలా తెలిసిందబ్బా..!

Update: 2019-12-18 02:15 GMT

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని గతంలో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు నిజం అయ్యేలా మంగళవారం ఏపీ అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ప్రకటన చేశారు. మొదటినుంచి కూడా రాయలసీమ నుండి ఎంపీ టీజీ వెంకటేష్ సీమ వాణిని బలంగా వినిపిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ కు మూడు రాజధానులు ఉంటె లేని ఇబ్బంది ఏపీలో మాత్రం ఉంటె తప్పేంటి అని అప్పట్లో ప్రశ్నించారు. రాజధానిగా అమరావతి కొనసాగే అవకాశం లేదన్న ఆయన ఒకవేళ అలా జరిగితే రాయలసీమ వాసులకు అన్యాయం జరిగినట్టే అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

తాజాగా ఈ విషయంలో టీజీ వ్యాఖ్యలకు అనుకూలంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరో వారంరోజుల్లో నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఆ తరువాత ముఖ్యమంత్రి విధానపరమైన నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని ఎంపీ టీజీ వెంకటేష్ స్వాగతించారు. ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్ ను పొగడ్తలతో ముంచెత్తారు. జగన్ తన తండ్రి వైఎస్ఆర్ లా ఆలోచిస్తున్నారని పొగిడారు. ఈ క్రమంలో జగన్‌పై చంద్రబాబు చేసిన తుగ్లక్ వ్యాఖ్యలు సరికావన్నారు. రాజధాని వికేంద్రీకరణ చేస్తేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్న అభిప్రాయాన్ని టీజీ వ్యక్తం చేశారు. అయితే కర్నూలులో అసెంబ్లీ, సచివాలయం కూడా ఏర్పాటు చేస్తేనే రాజధానిగా అర్థం ఉంటుందని అదేవిధంగా అమరావతి, వైజాగ్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

కాగా మంగళవారం ఏపీ అసెంబ్లీలో  సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ..  ఆంధ్రప్రదేశ్ కు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్ రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందనిపేర్కొన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తే అందుకు అనుకూలంగా కావలసినవన్నీ ఉన్నాయని, ఒక మెట్రో రైలు వస్తే సరిపోతుందని  అన్నారు. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయవచ్చునేమోనని ఏది ఏమైనా నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.  

Tags:    

Similar News