రామతీర్థంలో టెన్షన్.. టెన్షన్‌

* చలో రామతీర్థంను అడ్డుకున్న పోలీసులు * పోలీసులతో బీజేపీ నేతల వాగ్వాదం * కొండపైకి ఐదుగురినే అనుమతిస్తామన్న పోలీసులు

Update: 2021-01-07 06:03 GMT

Reprasentational image

బీజేపీ తలపెట్టిన చలో రామతీర్థం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కొండపై ఉన్న రాముల వారిని దర్శించుకునేందుకు ర్యాలీగా బయల్దేరిన బీజేపీ నేతలు, కార్యకర్తలను నెల్లిమర్ల దగ్గర అడ్డుకున్నారు పోలీసులు. కేవలం ఐదుగురికి మాత్రమే కొండపైకి అనుమతి ఉందని చెప్పారు. అందరికీ అనుమతివ్వాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు బీజేపీ నేతలు.

మరోవైపు పోలీసులను ముందుకు తోసుకుంటూ రామతీర్థం కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు బీజేపీ నేతలు. దీంతో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో సొమ్మసిల్లి పడిపోయారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, విష్ణువర్దన్‌ రెడ్డి. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

రామతీర్థం కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించిన పలువురిని అరెస్ట్ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు పోలీసులు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో రాములవారిని దర్శించుకునే వెళ్తామని బీజేపీ శ్రేణులు చెబుతున్నారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు సోము వీర్రాజు. వైసీపీ, టీడీపీ నేతలను కొండపైకి అనుమతించినప్పుడు.. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

ఇక అప్రమత్తమైన పోలీసులు ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలు, కార్యకర్తలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజుతో పాటు బీజేపీ ఎంపీ జీవీఎల్‌, పలువురు బీజేపీ నేతలను అరెస్ట్ చేసి సమీప పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Tags:    

Similar News