ఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం

Andhra Pradesh: టీచర్స్ అటెండెన్స్ కోసం కొత్త యాప్

Update: 2022-08-18 02:00 GMT

ఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం 

Andhra Pradesh: ఏపీలో ఉపాధ్యాయుల హాజరుపై విద్యాశాఖ తీసుకొచ్చిన నూతన విధానం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. కరోనా కారణంగా గతంలో బయోమెట్రిక్‌ విధానం రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పుడు తిరిగి మళ్లీ అన్ని నిబంధనలు అమలు చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఫేస్ రికగ్నైజేషన్‌ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సెలవుల సమాచారం కూడా ఇకపై యాప్‌లోనే పొందుపర్చాలనే నిబంధన విధించింది. ఫేస్ రికగ్నైజేషన్‌ విధానంపై ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

 ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నూతన విధానాన్ని ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యాప్‌లో టెక్నికల్‌ సమస్యలు ఎదురైతే ఎలా అంటూ టీచర్లు ప్రశ్నిస్తున్నారు. థర్డ్‌పార్టీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని హాజరు వేయమంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం నేరుగా డివైజ్ లు ఇస్తే వాటిని వినియోగిస్తామని చెబుతున్నారు. అప్పటి వరకు యాప్స్ డౌన్ లోడ్ చేయమని తెగేసి చెప్పారు.

టీచర్స్ అటెండెన్స్ యాప్‌తో మొదటి రోజే ఉపాధ్యాయులకు తిప్పలు తప్పలేదు. నెట్‌వర్క్ లేక కొంతమంది, స్మార్ట్ ఫోన్స్ లేక ఇంకొంత మంది ఈ యాప్‌తో చుక్కలు చూశారు. డౌన్‌లోడ్ ప్రాబ్లమ్, నెట్‌వర్క్ ప్రాబ్లమ్‌తో తలలు పట్టుకున్నారు. గతంలో ఉన్న బయోమెట్రిక్ విధానాన్ని పక్కన పడేసి కొత్తగా తీసుకుని వచ్చిన ఈ యాప్‌పై మండిపడ్డారు. పిల్లలకు పాఠాలు చెప్పాలా ? లేక యాప్‌తో కుస్తీ పట్టాలా అంటూ ప్రశ్నించారు.

ఓ వైపు యాప్ విధానం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంటే... యాప్‌ వినియోగంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. యాప్ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే నిరసనకు కార్యాచరణ సిద్ధం చేస్తామని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. 

Full View


Tags:    

Similar News