టీడీపీలో పితలాటకం పెట్టిన జగన్ ప్రకటన

Update: 2019-12-19 02:35 GMT

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అవసరం అవుతాయేమోనని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఈ విషయంలో వైసీపీ కాస్త క్లారిటీగానే ఉన్నా.. కొందరు టీడీపీ నేతలకు మాత్రం ఇరకటంలా మారింది. జగన్ అభిప్రాయాన్ని కొందరు టీడీపీ నేతలు సైతం సమర్ధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.. టీడీపీ అధిష్టానం మాత్రం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పట్టుబడుతోంది. అయితే ఈ నిర్ణయాన్ని రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్ధించారు.

ఆ మేరకు ట్వీట్ కూడా చేశారు. అందులో 'విశాఖపట్నం ని పరిపాలనా రాజధాని గా మార్చే అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి శాసనసభ లో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం. సహజ సిద్ధమైన సముద్ర తీర నగరం విశాఖ ను పరిపాలనా రాజధాని చేయడం మంచి నిర్ణయం. రోడ్, రైల్, ఎయిర్, వాటర్ కనెక్టివిటీ తో రాజధాని గా అందరి ఆశలు, ఆంక్షలని నెరవేర్చే నగరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాస్మో మెట్రో నగరం పరిపాలనా కేంద్రం గా కూడా మారితే విశ్వనగరంగా ప్రసిద్ధి చెందడం ఖాయం. అందుకు విశాఖ ప్రజలు తమ సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు.' అంటూ గంటా ట్వీట్ చేశారు.

అలాగే టీడీపీకి చెందిన మరో కీలక నేత కెఇ కృష్ణమూర్తి సైతం జగన్ వ్యాఖ్యలను సమర్ధించారు. రాయలసీమకు హైకోర్టు రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని.. కర్నూలుకు హైకోర్టు ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉందని అన్నారు. ఇక కృష్ణా, గుంటూరు ప్రాంతాల నేతలు రాజధాని తరలిపోవడానికి వీల్లేదని వ్యాఖ్యానిస్తున్నారు.. దానికి తోడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు, విశాఖ జిల్లాకు చెందిన, బాలకృష్ణ అల్లుడు భరత్ కూడా రాజధాని అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో టీడీపీ నేతలు తలో దారి అన్నట్టు ప్రకటనలు గుప్పిస్తున్నారు.

ఇది అటుంచితే జగన్ వ్యాఖ్యలను కొంతమంది రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల టీడీపీ నేతలు సమర్ధించకుండా ఉండలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. టీడీపీ అధిష్టానం నిర్ణయానికి అనుకూలంగా మాట్లాడితే తమ ప్రాంత అభివృద్ధి వ్యతిరేకులగా ముద్ర పడే అవకాశం ఉంది.. ఈ క్రమంలో వారి రాజకీయ భవిశ్యత్ ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితి. అలాగని టీడీపీ గీత దాటితే.. సొంత పార్టీల నాయకులే టీడీపీ నిర్ణయానికి కట్టుబడి ఉండలేదన్నఆరోపణ రాకమానదు. కరవమంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోపం.. అన్న చందంగా టీడీపీ నేతల పరిస్థితి తయారైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ పితలాటకంలో ఎవరు.. ఎంత మేర లబ్ది పొందుతారో చూడాలి.

Tags:    

Similar News