TDP-Janasena: నేటి నుంచి టీడీపీ- జనసేన ఆత్మీయ సమావేశాలు
TDP-Janasena: మూడ్రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు
TDP-Janasena: నేటి నుంచి టీడీపీ- జనసేన ఆత్మీయ సమావేశాలు
TDP-Janasena: ఇవాళ్టి నుంచి టీడీపీ- జనసేన ఆత్మీయ సమావేశాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈనెల 17 నుంచి చేపట్టే ఇంటింటి ప్రచారం, ఓట్ల బదలాయింపు, నకిలీ ఓట్ల అంశంపై చర్చించనున్నాయి. మొత్తం రెండు పార్టీల నుంచి 11 అంశాలపై చర్చించనున్నారు. చర్చల అనంతరం ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు కసరత్తు జరగనుంది.
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ- జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇరుపార్టీల సమన్వయ కమిటీల ఆదేశాల మేరకు టీడీపీ, జనసేన నాయకుల ఆత్మీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. అన్ని నియోజకవర్గాల పార్టీ ఇంఛార్జ్‌లు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు ఈ సమావేశాలకు హాజరవుతారు. ఇవాళ ఎలమంచిలి, పాయకరావుపేట, చోడవరం నియోజకవర్గాల్లో, 15న అనకాపల్లి, మాడుగుల, పెందుర్తి నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు జరగనున్నాయి. 16న జరగాల్సిన నర్సీపట్నం నియోజకవర్గం సమావేశాన్ని నాగుల చవితి సందర్భంగా వాయిదా వేశారు. ఈ నియోజకవర్గం సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామని పార్టీ వర్గాలు తెలిపారు.
టీడీపీ- జనసేన పార్టీల ఆత్మీయ సమావేశాల్లో భవిష్యత్తులో ఉమ్మడిగా చేపట్టబోయే కార్యక్రమాలపై ఇరు పార్టీల నాయకులు చర్చించనున్నారు. ముఖ్యంగా ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ నినాదంతో ఈ నెల 17వ తేదీ నుంచి ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని రెండు పార్టీల నాయకులు కలిసి నిర్వహించనున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ ల వారీగా ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ప్రతి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేల అసమర్థత, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తారు. జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులు, నిరుద్యోగం, ఇంకా పలు సమస్యలపై కలిసి పనిచేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఇరు పార్టీల నాయకులు కలిసి మీడియా సమావేశాలు నిర్వహిస్తారు. ప్రజా సమస్యలపై పోరాటాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు తయారు చేస్తారు.