టీడీపీకి మరో షాక్.. కీలకనేత రాజీనామా

Update: 2019-12-08 02:11 GMT

టీడీపీకి మరో సీనియర్ నేత షాక్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్సీ, కర్నూలు జిల్లా కీలకనాయకుడు సుధాకర్‌ బాబు టీడీపీకి రాజీనామా చేశారు. గతకొంతకాలంగా పార్టీ అధినాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న సుధాకర్ బాబు టీడీపీతో తెగదెంపులు చేసుకున్నారు. తన కార్యాలయంలో శనివారం విలేఖరుల సమావేశం నిర్వహించి రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం కోల్పోయాక టీడీపీ అధినేత చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. రాజకీయ అవసరాల కోసం ప్రజల కుల, మత చిచ్చుపెట్టడంలో అర్ధం ఏమిటని ప్రశ్నించారు. జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక దేవస్థానాల్లో క్రైస్తవులు ఉన్నారని సోషల్‌ మీడియాలో టీడీపీ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని ఇది తప్పని అన్నారు.

ఎన్నికలకు ముందు గుంటూరులోని ఓ చర్చికి వెళ్లిన చంద్రబాబు క్రైస్తవులకు అన్ని చేస్తామని చెప్పి టికెట్ల విషయంలో యూటర్న్‌ తీసుకున్నారని అన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు పిచ్చిపట్టిందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా కులాలు, మతాలపై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. క్రైస్తవ సమాజాన్ని పవన్ కళ్యాణ్ కించపరుస్తూ మాట్లాడుతున్నారన్న సుధాకర్‌ బాబు.. బట్టలు ఊడదీసి కొడతారని హెచ్చరించారు. చంద్రబాబు మత రాజకీయాలను వ్యతిరేకిస్తూ టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు సుధాకర్ బాబు ప్రకటించారు. ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. కాగా సుధాకర్ బాబు త్వరలో వైసీపీలో చేరేందుకు సిద్ధమయినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News