టీడీపీ పనిచేసేది ప్రజల కోసమే డబ్బుల కోసం కాదు: యనమల

ఏపీలో సిట్‌ చిచ్చు రాజుకుంది. రాజకీయ దుమారం రేపుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Update: 2020-02-23 09:23 GMT
Yanamala Rama Krishnudu

ఏపీలో సిట్‌ చిచ్చు రాజుకుంది. రాజకీయ దుమారం రేపుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలుగుదేశం పార్టీని అప్రదిష్టపాలు చేయడమే వైసీపీ ప్రభుత్వ పన్నాగమని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుగ్లక్‌ నిర్ణయాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమే తప్ప మరొకటి కాదని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... హైకోర్టు పర్యవేక్షణలో తొమ్మిది నెలల ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని తాము కోరామని డిమాండ్‌ చేస్తున్నట్టు యనమల తెలిపారు. హత్యలకన్నా కంటే ఆర్థికనేరాలు ప్రమాదకరమైనవని గతంలో సుప్రీంకోర్టు చెప్పినదాన్ని ఆయన గుర్తు చేశారు.

ఐదేళ్ల పాలనపై సిట్‌ వేసిన చరిత్ర ప్రపంచంలోనే లేదని యనమల మండిపడ్డారు. కోర్టుల విచారణ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వైసీపీ నాటకాలు ఆడుతుందని విమర్శించారు. 11 ఛార్జిషీట్లలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అవినీతిపై విచారణ కోర్టుల్లో తుది దశకు చేరిందని, ఈ నేపథ్యంలో..దానిని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ నేతలంతా నానా పాట్లు పడుతున్నారని ఆరోపించారు. సీఎం జగన్‌ తుగ్లక్‌ చర్యల ఫలితంగా రాష్ట్రంలో పెట్టుబడులకు తీవ్ర నష్టం కలిగిందని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతి కుంటుపడిందని, యువతకు ఉపాధి కల్పన పూర్తిగా దెబ్బతిందని దుయ్యబట్టారు. రాష్ట్రం కోసం టీడీపీ పనిచేస్తుందని, ప్రజల కోసమే తప్ప ఏనాడూ.. డబ్బుల కోసం పనిచేయలేదని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.

జగన్‌ ప్రభుత్వం 9 నెలల్లో కాలంలో టీడీపీ పాలనపై అనేక విచారణలు జరిపిందని, 3 సిట్‌లు, 6 కమిటీలు, విజిలెన్స్‌ విచారణలు, కేబినెట్‌ సబ్‌ కమిటీలు చేసినా ఏ ఒక్క ఆరోపణలు రుజువు చేయలేక పోయారని తెలిపారు. అయితే సీఎం జగన్‌ సన్నిహిత సహచరుడి నేతృత్వంలోని పోలీసు అధికారులతో సిట్‌ వేయడం దురుద్దేశ పూరితమని యనమల రామకృష్ణుడు అన్నారు. అయితే టీడీపీ పాలనలో అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం ఈ విషయం గతంలోనే చెప్పిందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అందులో భాగంగానే ఆధారాలు వెలికితీసేందుకే సిట్ ఏర్పాటు చేశామన్నారు.

  

Tags:    

Similar News