రాజధాని వికేంద్రీకరణపై టీడీపీ, బీజేపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు
మూడు రాజధానుల ప్రతిపాదనపై టీడీపీ, బీజేపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మూడు రాజధానుల ప్రతిపాదనపై టీడీపీ, బీజేపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళి, ఎమ్మెల్యే గణబాబు సమర్దిస్తుంటే.. ఇటు భూమా అఖిలప్రియ, బాలకృష్ణ అల్లుడు భరత్, మాజీ మంత్రి nmd ఫరూక్ , మాజీ మంత్రి చింతకాయల అన్నయ్య పాత్రుడు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తదితరులు సీఎం వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు.
మూడు రాజధానుల ప్రతిపాదనపై మాజీ మంత్రి, టీడీపీ ఆళ్లగడ్డ ఇంచార్జ్ భూమా అఖిలప్రియ మండిపడ్డారు. అమరావతిని మరింత అభవృద్ధి చేయాల్సిన జగన్.. విభజించి ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. తుపాన్‌ల ముప్పు ఉండే విశాఖను ఎలా రాజధానిగా చేస్తారని ఆమె ప్రశ్నించారు. కర్నూలుకు ఒక్క హైకోర్టు భవనం ఇస్తే రాయలసీమ అభివృద్ధి చెందుతుందా అని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధానిని తరలిస్తే ఊరుకునేది లేదని అఖిలప్రియ హెచ్చరించారు.
ఇటు బీజేపీలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా అమరావతిలోని రాజధాని ఉండాలని అన్నారు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మారుస్తామంటే ఎలా అని ప్రశ్నించారు..
జగన్ నాయకత్వంలో రాజధాని మార్పు అనేది జరుగుతున్న అభివృద్ధికి మంచిది కాదని విమర్శించారు. సీఎంగా జగన్ హాయంలో అభివృద్ధి జరుగుతుందని ఆశించడం కలగానే మిగులుతుందన్నారు కన్నా. ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి తప్ప.. పరిపాలన వికేంద్రీకరణ కాదన్నారు కన్నా.రాజధాని మూడు చోట్ల ఉండాలన్న జగన్ నిర్ణయంతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోతాయన్నారు బీజేపీ నేత, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. ఇప్పటికే రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని.. ఇప్పుడు మరిన్ని కష్టాలు తప్పవన్నారు అయన.
అయితే రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు అధికార వికేంద్రీకరణ జరగాలని సూచించారు. అలాగే జీఎన్‌రావు కమిటీ ఇచ్చిన సిఫార్సులను స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్‌రాజు. ఇటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతించారు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. అయితే శనివారం ఆయన మాట్లాడుతూ..అమరావతిలోని అసలు రాజధాని ఉండాలని కోరారు.