Andhra Pradesh: సీఎం జగన్ పై విమర్శలు...జడ్జి రామకృష్ణ అరెస్ట్

Andhra Pradesh: సీఎం జగన్‌ పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని జడ్జి రామకృష్ణను అరెస్టు చేశారు.

Update: 2021-04-16 03:02 GMT

Andhra Pradesh:(File Image)

Andhra Pradesh: సీఎం జగన్‌, రాష్ట్ర ప్రభుత్వం పై ప్రజల్లో ద్వేషం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై.. జడ్జి రామకృష్ణను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జయరామచంద్రయ్య బుధవారం ఫిర్యాదు చేయగా.. సస్పెండయిన జడ్జి రామకృష్ణపై ఐపీసీ సెక్షన్‌ 124ఏ కింద పీలేరు పోలీసులు దేశద్రోహం కేసు నమోదుచేశారు. రెండు రోజులుగా జ్వరం వస్తుండటంతో కరోనా పరీక్షల కోసం మదనపల్లె వెళ్తుండగా.. దారిలోపీలేరు ఎన్టీఆర్‌ కూడలి వద్ద మధ్యాహ్నం 12.30కు పోలీసులు వచ్చి రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పీలేరు సీఐ కార్యాలయానికి తరలించి అరెస్టు చేశారు. మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచగా, ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. దాంతో జడ్జి రామకృష్ణను పీలేరు సబ్‌జైలుకు తరలించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఏప్రిల్‌ 12న రాత్రి 9.30కు ఓ టీవీ ఛానల్‌లో 'అమెరికా మానవ హక్కుల నివేదిక 2020' గురించి నిర్వహించిన చర్చలో రామకృష్ణ మాట్లాడుతూ 'జగన్‌ మోహన్‌రెడ్డి కంసుడిలా తయారయ్యాడు. ఈ రాక్షసుడిని, రాక్షస పాలనను అంతం చేయడానికి.. నేను కృష్ణుడిగా భావించి.. నరకాసురుడు, కంసుడైనటువంటి జగన్‌మోహన్‌రెడ్డిని ఎప్పుడు శిక్షించాలా అని ఎదురు చూస్తున్నాను' అని అన్నారని జయరామచంద్రయ్య ఫిర్యాదు చేశారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తాను.. ప్రభుత్వం చేస్తున్న మేలును తలచుకొని ఫిర్యాదు చేస్తున్నానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రామకృష్ణపై 153, 153ఏ సెక్షన్లు కూడా నమోదు చేశారు. గతంలోనూ ఆయన్ని తిరుపతిలో ఒకసారి పోలీసులు అరెస్టు చేశారు.

సీఎంపైనా చర్యలు తీసుకోవాల్సిందే...

2018 నంద్యాల ఉప ఎన్నికల్లో అప్పటి సీఎం చంద్రబాబును ప్రస్తుత సీఎం జగన్‌రెడ్డి రోడ్డుపై కాల్చి చంపాలని పిలుపునిచ్చారని పీలేరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రామకృష్ణ పేర్కొన్నారు. జగన్‌ వ్యాఖ్యలతో తన మనోభావాలు దెబ్బతిని, అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయానన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, ముఖ్యంగా ఎస్సీల పరిస్థితి దయనీయంగా ఉందని.. సీఎం జగన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. రామకృష్ణ నుంచి తమకు ఫిర్యాదు ఏమీ అందలేదని పీలేరు పోలీసులు తెలిపారు.


Tags:    

Similar News