చేతివాటం ప్రదర్శిస్తున్న దొంగలు
పండగ సంతలలో చోరులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు.
చింతపల్లి: పండగ సంతలలో చోరులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. తెలుగు వారి పెద్ద పండుగ గా చెప్పుకునే సంక్రాంతి పర్వదినం సంధర్భంగా వారపుసంతలే గాక మండల కేంద్రాలు సైతం జన సంచారం, వ్యాపార లావాదేవీలతో కిటకిటలాడుతున్నాయి. ఇటువంటి క్రమంలోనే మైదాన ప్రాంతాల నుంచి చోరులు (దొంగలు) తమ చేతివాటాన్ని ప్రదర్శించేందుకు మన్య ప్రాంతంలో వారపు సంతలు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలలో తిరుగుతున్నారు.
పండగ సంతలలో ప్రతీ ఏటా దొంగల బెడద ఉంటుందని గ్రహించిన పోలీసు శాఖ మన్యం వారపు సంతలే గాక మండల కేంద్రాల్లో జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. స్థానిక ఎస్ఐ పాపినాయుడు ఆద్వర్యంలో ముఖ్య కూడళ్ళ వద్ద పహారా కాస్తూ కొత్తగా మన్య ప్రాంతంలో సంచరించే వారిపై నిఘా పెట్టారు. అనుమానితులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు.